నల్లగొండ జిల్లా: భారత మాజీ ప్రధాని, భారతరత్న,స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్,జిల్లా అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి మాట్లాడుతూ…దేశంలో టెలి కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో సంస్కరణలు తీసుకువచ్చి భారతదేశంలో సాంకేతిక విప్లవం తీసుకువచ్చిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
దేశ అభివృద్ధిలో యువత ప్రాముఖ్యతను గుర్తించి 18 ఏళ్లు నిండిన వయోజనులకు ఓటు హక్కు కల్పించారని, పరిపాలన వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి నేరుగా గ్రామపంచాయతీలకే నిధులు అందే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధాని పదవి స్వీకరించిన సమయంలో దేశంలో నెలకొన్న తీవ్రమైన అస్సాం తీవ్రవాదులు, కాశ్మీర్ తీవ్రవాదులు, పంజాబ్ తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాలలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిపించారని, తమిళుల సమస్య పరిష్కారం కోసం శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాలను పంపించి,దక్షిణ ఆసియా దేశాలకు సహకారం అందించాడని,దేశం కోసం ఇద్దరు ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం దేశానికి ఎనలేని సేవ చేసిందన్నారు.
ప్రస్తుతము దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, దేశ సమైక్యత,సమగ్రతకు పాటుపడ్డ రాజీవ్ గాంధీకి నిజమైన నివాళులు అర్పించడం అంటే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం స్థాపించడానికి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జడ్పీటిసి వంగూరి లక్ష్మయ్య,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,పెరిక వెంకటేశ్వర్లు,జూకూరి రమేష్,పాదూరి శ్రీనివాసరెడ్డి,కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.