నల్గొండ జిల్లా:హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నభోజన పథకం అమలు మిధ్యగానే మారింది.ప్రభుత్వం హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి.
మధ్యాహ్నం భోజనం పథకం అమలు కాకపోవడం, దూర ప్రాంతాల నుండి వచ్చేవారు భోజనం తెచ్చుకోకపోవడం వల్ల మధ్యాహ్న భోజనం లేక నీరసించి చదువపై దృష్టి పెట్టలేక పోతున్నారు.కొంతమంది ఆకలి తట్టుకోలేక మధ్యాహ్నం తర్వాత ఇంటిబాట పడుతున్నట్లు సాయంత్రం హాజరు శాతాన్ని చూస్తే అర్ధమవుతుంది.
ఉదయం తరగతులకు హాజరైన విద్యార్థులు సాయంత్రం వరకు ఉండటం లేదని అధ్యాపకులు కూడా పేర్కొంటున్నారు.మధ్యాహ్నం తర్వాత 30 నుంచి 40 శాతం హాజరు తగ్గిపోతుందని చెబుతున్నారు.
ఈ కారణంగా కొందరు తల్లిదండ్రులు పిల్లలను చదువు మాన్పించి వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నారని సమాచారం.
నాలుగేళ్ల క్రితం సీఎం హామీ,రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్య అందిస్తామని చెబుతూ పాఠశాలల్లో మాదిరిగానే కళాశాలల్లోనూ 2017-18 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు.దీనిపై ఇప్పటికే పలుమార్లు విద్యార్ధి సంఘాల నాయకులు ఆందోళనలు సైతం చేపట్టారు.
జిల్లాలో 12 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.వీటిలో దాదాపు 80 శాతం మంది గ్రామీణ విద్యార్థులే చదువుతున్నారు.
ఉదయం ఇంట్లో భోజనం సిద్ధం కాకముందే హడావుడిగా ఏమీ తినకుండా కాలేజీకి బయలుదేరుతారు.కొంతమంది మాత్రమే మధ్యాహ్నం కోసం టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు.
మిగిలిన వారు సాయంత్రం ఇళ్లకు వెళ్లే వరకు ఆకలితో అలమటించాల్సిందే.దూర ప్రాంతాల నుంచి రాకపోకలు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ కోసం మండల కేంద్రాలు,పట్టణాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతున్నారు.మండల కేంద్రాల నుంచి 20,30 కి.మీ.దూరంలో ఉన్న గ్రామాలు,గిరిజన తండాల నుంచి విద్యార్థులు అనేక వ్యయ ప్రయాసలకోర్చి కళాశాలకు వస్తున్నారు.చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో ప్రైవేట్ కళాశాలకు వెళ్లకుండా ప్రభుత్వ విద్యపైనే ఆధారపడుతున్నారు.వీరికి మధ్యాహ్న భోజనం అందని ద్రాక్షగానే మిగిలింది.ఫస్టియర్ 2,200, సెకండియర్ 3,800 మంది విద్యార్థులు మొత్తం 6,000 మంది ఉన్నారు.ఫస్టియర్ అడ్మిషన్లు కొనసాగుతుండడంతో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కానీ,ప్రభుత్వం ఇచ్చిన మధ్యాహ్న భోజన పథకం మాత్రం అమలుకు నోచుకునే అవకాశం కనిపించడం లేదు.