టీడీపీ కంచుకోట బెజవాడలో ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు అక్కడి నేతలు.గ్రూప్ రాజకీయాలకు.
వర్గపోరుకు బాటలు వేస్తున్నారు.సొంత పార్టీ నేతలతోనే కయ్యం పెట్టుకుని వైరం పెంచుకుంటున్నారు.
గ్రూపు రాజకీయాల వల్లే బెజవాడ కార్పొరేషన్ లో టీడీపీ ఓడిపోయిన సంగతీ అందరికీ తెలిసిందే.దీంతో అసలు బెజవాడలో ఏం జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది.
బెజవాడలో ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా వంటి నేతలు వ్వవహరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.అలాగే కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని వ్యవహారం కూడా అలాగే ఉందాట.
ఎంపీ కేశినేనికి అధిష్టానికి గ్యాప్ పెరగడంతో చిన్ని దగ్గరవుతున్నాడనే వాదన ఉంది.ఆ మధ్య చిన్ని బాబును, లోకేశ్ బాబును కలవడం చర్చకు దారితీసింది.
ఇక రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియని సమయంలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నడిపించే నాయకులు ఇలా ఉంటే ఎలా అని అంటున్నారు.
ఇటీవల జరిగిన టీడీపీ మహానాడులో బాబు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
అన్ని నియోజకవర్గాల్లో నేతలు రెగ్యూలర్ గా పర్యటించి ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలని సూచించారు.ప్రజల్లో ఉన్న వారికే టికెట్లు దక్కుతాయని కూడా చెప్పారు.
దీంతో అన్ని జిల్లాల్లో నేతలు అలెర్ట్ అయ్యారు.అయితే ఇందుకు భిన్నంగా బెజవాడలో పరిస్థితి కనబడుతోంది.
వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే.అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తూర్పు నియోజకర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజల్లో ఉంటున్నా కేశినేని వర్గం మాత్రం ఈ మధ్య దూరంగా ఉంటోంది.
![Telugu Bonda Uma, Budda Venkanna, Jaleelkhan, Mp Keshineni, Vijayawada-Political Telugu Bonda Uma, Budda Venkanna, Jaleelkhan, Mp Keshineni, Vijayawada-Political](https://telugustop.com/wp-content/uploads/2022/06/budda-venkanna-bonda-uma-jaleelkhan-keshineni-chinni.jpg)
ఇక ప్రస్తుతం బెజవాడలోని మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల మాత్రమే టీడీపీకి పట్టుంది.దీంతో పాటు ఎంపీ స్థానం టీడీపీ ఖాతాలోనే ఉంది.తూర్పు సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంది.ఇక పశ్చిమలో ఎవరూ పార్టీని పట్టించుకోవడం లేదు.కారణం వైసీపీ నుంచి వచ్చిన జలీల్ ఖాన్ కు టీడీపీ పెద్దపీట వేసిందని గుర్రుగా ఉన్నారు.ఇక ఎంపీ కూడా పశ్చిమ వైపే చూస్తున్నా వచ్చే ఎన్నికల్లో ఆయన ఆశించినట్టు కుమార్తెకు టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు.దీంతో ఆయన కూడా ఇక్కడ సైలెంట్ అయ్యారు.
ప్రధానంగా ఏదైనా ఉంటేనే మీడియా ముందుకు వస్తున్నారు తప్పితే జనాల్లో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.కాగా బెజవాడలో వర్గ విభేదాలపై హైకాండ్ పట్టించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఇక్కడి నేతలు కోరుకుంటున్నారు.
లేదంటే టీడీపీ బలంగా ఉండే బెజవాడపై పట్టు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు.ఇది ఇలాగే కొనసాగితే వైసీపీ బలపడుతుందనేది వాస్తవం.ఇక బాబు ఈ గ్రూపు రాజకీయాలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.