యాదాద్రి జిల్లా:రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో అరే క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బుధవారం టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్,భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వలకు ఒక్క చుక్కనీరు ఇవ్వకుండా, కాల్వల పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు.
రాష్ట్రంలో పాలన చేయలేని ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లోకి పోవడం విడ్డురంగా ఉందని దెప్పి పొడిచారు.కొండపోచమ్మ,మల్లన్న సాగర్ ప్రాజెక్టుల వల్ల ముఖ్యమంత్రి పంహౌజ్ లో నీళ్లు అందుతున్నాయని, తన నియోజకవర్గంలో మూసి నీళ్లు ఇవ్వడానికి కేసీఆర్ కి మనసు రావడం లేదని అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేర్చలేదని,దళితులకు భూమి,డబుల్ బెడ్రూమ్ వంటి హామీలు హామీలుగానే మిగిలాయని విమర్శించారు.
గౌరవెల్లి నిర్వశితులపై లాఠీఛార్జ్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.బాసరలో ఆరువేల మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తుంటే కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తా అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు తప్ప ఒక్క కొత్త ఇల్లు కట్టివ్వలేదని,పీకే లాంటి కన్సల్టెన్సీలను నమ్ముకుంటే ఓట్లు పడవని,ప్రజలకు పనులు చేస్తే ఓట్లు అవే వస్తాయని ఉచిత సలహా ఇచ్చారు.నల్గొండను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి బ్రాహ్మణవేళ్లెంల ప్రాజెక్ట్ ను పూర్తిచేయలేకపోయాడని, నల్గొండ పట్టణంలో వున్న రోడ్లను తవ్వి మళ్ళీ వేస్తున్నారని,భవనాలు కూల్చిన వారికి సరైన పరిహారం ఇవ్వడంలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని మా పిల్లలు అంటున్నారని కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సెటైర్లు వేశారు.రేపు గౌరవెళ్లి నిర్వశితులను కలిసి పరామర్శిస్తానని,త్వరలోనే బాసర వెళ్లి విద్యార్థులకు బాసటగా ఉంటానని తెలిపారు.