ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు.ప్రజా ప్రతినిధుల,అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన.
యాదాద్రి జిల్లా:వలిగొండ మండలం చిత్చాపురం గ్రామ శివారులోని మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన కావటి మనోహర్(30) బైక్ పై వెళుతుండగా బోరబండగూడెం దగ్గర అతివేగంగా వస్తున్న ఇసుక లారీ బైక్ ను ఢి కొట్టడంతో మనోహర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
మృతుడు బీజేపీ కార్యకర్త కావడంతో అతని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు.దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి,భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమంగా ఇసుకను తరలిస్తూ వందలాది లారీలు ఈ రోడ్డుపై అక్రమ రవాణా చేస్తున్నాయని,ప్రజాప్రతినిధులు ప్రోద్బలంతో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అధికారులు,పోలీసులు అనధికార అనుమతులు ఇస్తూ చూసిచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లనే అడ్డూ అదుపూ లేకుండా ఇసుక లారీలు తిరుగుతున్నాయని,దీనివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని మండిపడ్డారు.కాసులకు కక్కుర్తి పడి ప్రజా ప్రతినిధులు,నాయకులు,అధికారులు ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు.
మనోహర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు.