తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సొంత పార్టీ లో తనకు వ్యతిరేకంగా చెలరేగిన అసమ్మతి ని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయం పైన దృష్టి పెట్టారు.
ఒకవైపు అధికార పార్టీ టిఆర్ఎస్ కు దీటుగా బీజేపీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంపై దృష్టి పెడుతూనే మరో వైపు తనకు వ్యతిరేకంగా పార్టీలోని కొంత మంది నాయకులు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తుండడం సంజయ్ కు ఆగ్రహం ,ఆందోళన కలిగిస్తున్నాయి.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే సొంత పార్టీ నాయకుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారో అదే మాదిరిగా సంజయ్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఆయనకు సహకరించనట్టు గానే వ్యవహరిస్తున్నారు .ఈ విషయంలో అధిష్టానం జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ నాయ కత్వాన్ని ఒప్పు కునేది లేదు అంటూ సీనియర్ నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నారు.దీంతో కాంగ్రెస్ కు రాజకీయ ప్రత్యర్ధి అయిన బీజేపీ, టిఆర్ఎస్ లను ఎదుర్కొనే వ్యవహారాలను పక్కనబెట్టి , సొంత పార్టీలోని అసమ్మతిని చల్లార్చే విషయంపైనే రేవంత్ దృష్టి సారించారు.
ఇప్పుడు సంజయ్ పరిస్థితి అదే మాదిరిగా తయారైంది.బీజేపీలో కొంత మంది సంజీవ్ వ్యతిరేక వర్గం వారు రహస్య సమావేశాలు నిర్వహిస్తుండడం పై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినా, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలు చేసినా పరిస్థితుల్లో అయితే మార్పు కనిపించడం లేదు.తాజాగా సంజయ్ వ్యతిరేక వర్గం అంతా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రహస్యంగా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం పార్టీలో రచ్చగా మారడంతో , మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనా రెడ్డి అసమ్మతి నేతలతో చర్చలు కూడా జరిపారు.
ఇక పార్టీ లో చోటుచేసుకున్న పరిణామాలపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరైనా పార్టీ సిద్ధాంతాలు , విధానాలకు లోబడి మాత్రమే పని చేయాలి అని , ఎవరైనా పార్టీ సిద్ధాంతాలను పట్టించుకోకపోతే వారిపై సస్పెన్షన్ వేటు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అయినా అన్ని పార్టీల్లోనూ అసమ్మతి నేతలు ఉంటారని, వారిని పట్టించుకోనవసరం లేదని సంజయ్ చెబుతున్నారు.కానీ లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నారట.