ఎప్పుడూ లేని విధంగా ఏపీలో వైసీపీ జనసేన మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ వైసిపి కి చెందిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అందరూ విమర్శలు చేస్తున్నారు.
పవన్ సైతం అంతే స్థాయిలో ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు.అనేక సవాళ్ళు విసురుతూ రాబోయే రోజుల్లో వైసిపికి అసలు సిసలు రాజకీయ ప్రత్యర్థి తామే అన్నట్లుగా జనసేన వ్యవహరిస్తోంది.
ఈ వ్యవహారాలతో ఏ సంబంధం లేకపోవడంతో టిడిపి సైతం మౌనంగానే ఉంది.ఒకరిద్దరు నేతలు తప్ప పెద్దగా టిడిపి నుంచి పవన్ కు మద్దతు లభించడంలేదు.
అయితే జనసేన పార్టీ తో అధికారికంగా పెట్టుకున్న బిజెపి సైతం ఈ వ్యవహారంలో తమకు ఏమి సంబంధం లేదన్నట్లుగా సైలెంట్ అయిపోయింది.
పవన్ కు మద్దతుగా వైసీపీ ని ఇరుకున పెట్టే అవకాశం బిజెపి నేతలకు దొరికినా, దానిని వినియోగించుకోవడం లేదు.
అసలు పవన్ కు వైసీపీ ప్రభుత్వానికి మధ్య వివాదం ఏర్పడడానికి కారణం సినిమా టిక్కెట్ల అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడం.ఈ ఆన్లైన్ విధానం ద్వారా ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని భావించడం పైనే పవన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఈ విధానం ద్వారా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని ఆయన చెబుతున్నారు.అయితే ఈ వ్యవహారంలో బిజెపి స్పందించడం లేదు.సినిమా టిక్కెట్లను ఆన్లైన్ చేయడం పై బిజెపి తన వైఖరి ఏమిటో ఇప్పటి వరకు చెప్పలేదు.

ఇదే కాదు పవన్ పై వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నా, ఈ విషయంలో బిజెపి నేతలు మౌనంగానే ఉండిపోయారు.రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఒక్కరే మొక్కుబడిగా స్పందించడం తప్ప, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కానీ, ఆ పార్టీలో కీలక నాయకులు కానీ, దీనిపై స్పందించలేదు.దీంతో అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా లేక ఆ పొత్తును రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారా అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు.ఈ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా విభేదాలు పెరిగిపోయాయని, అందుకే తమ భాగస్వామ్య పార్టీని వైసిపి నేతలు ఇంతగా టార్గెట్ చేసుకున్నా, తమకేమీ పట్టనట్లు గానే వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.