కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికా .తన పౌరులను రక్షించుకునేందుకు గాను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తొలుత కొన్ని అవాంతరాలు ఏదురైనా పెద్దన్న ఈ కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించింది.ఈ క్రమంలో అగ్రరాజ్యం అరుదైన మైలురాయిని అందుకుంది.
దేశంలో కనీసం సగం మందికి టీకాలు అందించినట్లుగా ప్రకటించింది.దేశంలోని పెద్దల్లో సగం మంది ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడించింది.
మంగళవారం నాటికి 50 శాతం మంది పెద్దలకు ఒక డోసును అందించినట్లుగా అమెరికన్ మీడియా కథనాలు ప్రచురించింది.కానీ సీడీసీ మాత్రం అంతకంటే ఎక్కువ మందే టీకాలు తీసుకున్నట్లు చెబుతోంది.దేశంలోని 61.3 శాతం పెద్దలు కనీసం ఒక డోసు తీసుకోగా.49 శాతం మందికి డబుల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు సీఎన్‌ఎన్ ఒక కథనంలో పేర్కొంది.అలస్కా, కాలిఫోర్నియా, కొలరాడో, డెలావేర్, హవాయి, ఐయోవా, మేరీల్యాండ్, మాసాచుసెట్స్, మిచిగాన్, మిన్నెసోటా, నెబ్రాస్కా, న్యూహాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూమెక్సికో, న్యూయార్క్, ఓరెగాన్, పెన్సిల్వేనియా, సౌత్‌డకోటా, వర్జీనీయా, వాషింగ్టన్, విస్కన్సన్‌లలో అధికంగా వ్యాక్సినేషన్ జరిగింది.
అటు కేసులు తగ్గుముఖం పట్టడం, ఒక్కొక్కటిగా ఆంక్షలు తొలగుతుండటంతో న్యూయార్క్ రాష్ట్రం పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది.కాగా, గతేడాది డిసెంబర్ 14 నుంచి అమెరికాలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
ఫైజర్ సంస్థ అభివృద్ది చేసిన టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది.దీనిలో భాగంగా తొలి టీకాను ఓ నర్సుకు అందజేశారు అధికారులు.
క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్‌లో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్స్ అమెరికాలో తొలి కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర పుటల్లోకెక్కారు.వ్యాక్సిన్ తీసుకునేందుకు కోట్లాది మంది అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ .టీకా తీసుకున్న పలువురిలో అలర్జీ లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
కానీ తర్వాత అలాంటివి పెద్దగా లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.అమెరికాలో ఈస్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం వెనుక ఖచ్చితంగా అధ్యక్షుడు బైడెన్‌దే కీలక పాత్ర.అధికారంలోకి వస్తూనే కరోనా అంతమే తన మొదటి లక్ష్యయమన్నారు జో బైడెన్.
అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.దీంతో బైడెన్ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.
దాన్ని కూడా 10 రోజుల ముందే.అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.
ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, జూలై 4 నాటికి దేశాన్ని కరోనా ఫ్రీగా చేయాలని బైడెన్ కంకణం కట్టుకున్నారు.