ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో తాజ్ మహల్ వద్ద ఆగంతకులు బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.దీంతో తాజ్ మహల్ ను తాత్కాలికంగా మూసివేశారు.
పర్యాటకులను వెంటనే బయటకు పంపేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు.బాంబు స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగడంతో పరిసర ప్రాంతాలను జల్లెడ వేసే రీతిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి ఉత్తర ప్రదేశ్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు తెలపడంతో వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యి తనిఖీలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఫోన్ కాల్ ఫిరోజాబాద్ నుండి వచ్చినట్లు గుర్తించారు.
ఇప్పటి వరకు చేసిన తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అగ్రా ఎస్పీ శివరామ్ యాదవ్ తెలిపారు.అయినా కానీ తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.