ఏది ఏమైనా, దుబ్బాక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో వస్తున్న ఫలితాలు అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగానే మారాయి.ఫలితం ఇంకా స్పష్టం గా తెలనప్పటికీ బిజెపి వైపు ఫలితం ఉండేలా కనిపిస్తుండడంతో, అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి.
అసలు ఇంత అకస్మాత్తుగా బిజెపి బలం పుంజుకుంటుంది అని ఎవరూ ఊహించలేకపోయారు.తెలంగాణలో బిజెపి ఉన్నా, హైదరాబాద్ సిటీ లో మాత్రమే కాస్తో కూస్తో బలంగా ఉన్నట్టు కనిపించేది తప్ప, మిగతా చోట్ల పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ ను సైతం పక్కకునెట్టి, అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళగలిగింది అంటే ఆషామాషీ కాదు.ఈ వ్యవహారంలో బిజెపి నాయకులు అంతా సమిష్టిగా పని చేయడం వల్లే బాగా వర్కవుట్ అయినట్టు కనిపించింది.
ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి , బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎవరికి వారు ఇక్కడ కీ రోల్ పోషించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపించడంలో అందరూ బాగా సక్సెస్ అయినట్టు గానే కనిపిస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన అన్ని రౌండ్ల కౌంటింగ్ ను పరిశీలిస్తే ఎక్కువ శాతం బీజేపీకే ఆధిక్యం కనిపించింది.ఇక ఇక్కడ బిజెపి గెలుస్తుందా టిఆర్ఎస్ గెలుస్తుందా అనేది అధికారికంగా తేలేందుకు మరి కొంత సమయం పడుతుంది.
కానీ అసలు బిజెపి ఇలా, ఎలా అందుకోగలిగింది అనేది టిఆర్ఎస్ నేతలకు అంతుపట్టడం లేదు.మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి కి అరవై వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
ఇక అప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు డిపాజిట్లు సైతం దక్కించుకోలేక మూడో స్థానానికి పరిమితం అయిపోయారు.ఇప్పుడు అదే రఘునందన్ రావు గెలిస్తే ఉండడం, ఎవరికీ అంతుపట్టడం లేదు.
కాకపోతే బిజెపి ప్రచార శైలి మిగతా చోట్ల కంటే దుబ్బాకలో భిన్నంగా సాగింది ఎప్పుడూ మతం ఆధారంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ ఇక్కడ ఎక్కువగా ప్రజాసమస్యల విషయం పైన దృష్టి పెట్టింది.
టిఆర్ఎస్ ప్రభుత్వం తో పాటు, స్థానిక ప్రజలలో నమ్మకం కలిగించడం లో సక్సెస్ అయింది.బిజెపి ఇక్కడ గెలుస్తుందా లేదా అనేది పక్కనపెడితే, ఇప్పుడు దుబ్బాక లో వచ్చిన ఊపుతో గ్రేటర్ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయడంతో పాటు ,ఫలితాలు తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది .2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను పూర్తిగా పక్కకునెట్టి , బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టుగానే పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.ప్రస్తుతం దుబ్బాక లో నెలకొన్న పరిస్థితులను బట్టి ఇక ముందు ముందు తెలంగాణపై కేంద్ర బిజెపి పెద్దలు ప్రత్యేక దృష్టి సారించి అధికారం వైపు రాష్ట్ర నాయకత్వాన్ని నడిపించే దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తోంది.