నవమాసాలూ మోసి కన్న బిడ్డ దూరమైతే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది.ఆరేళ్ల వయసులో కనిపించకుండా పోయిన కొడుకు కోసం ఆ తల్లి కూడా ఎంతో బాధ పడింది.
కొడుకు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసింది.పోలీసుల సాయం కోరింది.
చివరికి కొడుకు చనిపోయాడనే కబురు రావడంతో నిజమేనేమో అని నమ్మి,గుండెపగిలేలా రోధించింది.కానీ …పదేళ్ల తర్వాత తప్పిపోయిన కొడుకు తిరిగొచ్చాడు… దాంతో ఆ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతానికి చెందిన సలీం, హమీదాల కుమారుడు హసన్.ఆరేళ్ల వయసులో హసన్‌ను దిల్లీలోని ఓ మదర్సాలో చేర్పించారు తల్లిదండ్రులు.కానీ అమ్మని వదిలి ఉండలేని హసన్, ఒక రోజు అక్కడి నుంచి పారిపోయాడు.హసన్ కోసం సలీం ,హమీదాలు అన్ని చోట్లా వెతికారు.పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు రోజూ పిలిచేవారు.
సాయంత్రం దాకా కూర్చోబెట్టేవారు.కానీ ఎలాంటి సమాచారం ఇచ్చేవారు కాదు.
చాలా రోజులు అలానే గడిచిపోయాయి.రోజూ స్టేషన్‌కు వెళ్లిరావడానికి డబ్బులు లేక, కొన్నాళ్లకు వెళ్లడం మానేశారు.
హమీదా మొదటి భర్త దూరమయ్యాక సలీం ను పెళ్లి చేసుకుంది.హసన్ హమీదాకు మొదటి భర్తకు పుట్టిన కొడుకు.దాంతో సవతి తండ్రివి కాబట్టే బిడ్డ కోసం వెతకట్లేదని చుట్టపక్కల వారు సూటి పోటి మాటలతో గాయపరిచేవారు.సలీం ఏనాడు హసన్ ని పరాయి వాడిగా చూడలేదు.
హసన్ కనిపించకుండా పోయిన తర్వాత ఎంతో బాదపడ్డాడు.హమీదా సలీంలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.
పదేళ్ల తర్వాత హసన్ ఇంటికి తిరిగిరావడంతో ఆ దంపతులు ఎంతో సంతోషపడ్డారు.
మదర్సా నుండి పారిపోయిన హసన్ ను ఒక ఎన్జీవో చేరదీసింది.ఇంతకీ హసన్ ఇంటికి ఎలా చేరాడంటే.తన మాటల్లోనే ‘‘నేను ఓసారి బస్సులో ప్రయాణిస్తుండగా కిటికీలో నుంచి ఆ మదర్సాను, పక్కనున్న అడవిని చూశా.
తరువాత తెలిసిన ఓ అన్న గూగుల్‌లో దాని గురించి వెతికాడు.ఇద్దరం మదర్సాకు వెళ్లాం.మా అమ్మ ఇప్పటికీ మదర్సాకు వచ్చి వెళ్తోందని వాళ్లు చెప్పారు.అమ్మానాన్నలను చూడగానే నేను గుర్తుపట్టా.
ఇప్పుడు నా కుటుంబం నాకు దొరికింది.జీవితంలో నాకు కావలసినవన్నీ దొరికాయి’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.
మరోవైపు “నా బిడ్డ తిరిగొచ్చాడన్న వార్త వినగానే ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అనిపించిందని” హమీదా అన్నారు.హసన్ వచ్చాడన్న విషయం తెలిసాక బైక్‌పై వస్తుంటే శరీరమంతా వణికిందని, ఆ విషయాన్ని నమ్మలేకపోయానంటూ సలీం భావోద్వేగానికి గురయ్యారు.
ఎంతైనా పేగు బంధం అలాంటిది…