పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తన 100వ టెస్టు మ్యాచ్‌లో ఓ భారీ రికార్డును చేరుకున్నాడు.ఫలితంగా దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు.
శుక్రవారం నుంచి శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి 8000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.వ్యక్తిగతంగా 38 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ అరుదైన ఫీట్ సాధించాడు.2019 నవంబర్ తర్వాత టెస్టు మ్యాచ్ లలో సెంచరీ సాధించలేదు కోహ్లి.దీంతో తన 100వ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించి, భారతీయ క్రికెటర్లెవరికీ సాధ్యం కాని రికార్డును సాధిస్తాడని అభిమానులు గంపెడాశతో ఎదురు చూశారు.
అయితే 45 పరుగులు మాత్రమే చేసి, వెనుదిరగడంతో అంతా నిరాశ చెందారు.
టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడడమే గొప్ప ఘనతగా చెబుతుంటారు.
ఎంతో ప్రతిభ ఉన్నా చాలా మందికి ఫామ్ లేమితో జట్టు దూరమై, చివరికి తమ కెరీర్‌ను ముగించేస్తుంటారు.పరుగులు చేయడంలో అలసిపోని కోహ్లి ఈ మైలురాయిని చేరడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా ప్రశంసించారు.
ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను చూసేందుకు ఆయన విదేశాల నుంచి విచ్చేశారు.ఇక 8 వేల పరుగుల క్లబ్‌లో చేరిన భారత క్రికెటర్లను పరిశీలిస్తే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 8 వేల పరుగులు చేసిన భారతీయులలో కోహ్లిది ఐదవ స్థానం.169 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ మైలురాయిని చేరుకున్నాడు.8 వేల పరుగుల జాబితాలో వరుసగా సచిన్ (154), ద్రవిడ్(157), సెహ్వాగ్(160), గవాస్కర్(166) ఇన్నింగ్స్‌లలో ఆ ఫీట్ చేరుకున్నారు.కోహ్లి తరువాత స్థానంలో లక్ష్మణ్ (201) ఉన్నాడు.

దేశం తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్లలో దిగ్గజాలు ఉన్నారు.ఈ జాబితాలో గవాస్కర్, వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, సచిన్, కుంబ్లే, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, హర్భజన్, ఇషాంత్ ఉన్నారు.ప్రస్తుతం ఈ జాబితాలో కింగ్ కోహ్లీ కూడా చేరడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇప్పటి వరకు 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్లు తమ చారిత్రాత్మక టెస్టులో సెంచరీ చేయలేకపోయారు.అయితే ఆ రికార్డు కోహ్లిని ఊరిస్తోంది. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఈ పరుగుల యంత్రం వెనుదిరిగాడు.అయితే రెండవ ఇన్నింగ్స్‌లోనైనా కోహ్లి ఈ రికార్టు సాధించాలని అంతా ఎదురు చూస్తున్నారు.