గత వైసిపి( YCP ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలోని ఋషికొండ పై ప్రభుత్వ భవనాలు నిర్మించింది.వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే, విశాఖ నుంచే పరిపాలన కొనసాగించేందుకు వేలుగా ఈ నిర్మాణాలు చేపట్టారు.
అయితే ఫలితం టిడిపి కూటమికి అనుకూలంగా రావడంతో, వైసీపీ అధినేత జగన్( jagan ) ఆశలు నెరవేరలేదు.ఇక కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రుషికొండ భవనాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, వైసిపి పై జనాల్లో విమర్శలు వచ్చే విధంగా మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అనుకున్నట్టుగానే వైసీపీ ఈ విషయంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది.
ఋషికొండ భవనాలను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( MLA Ganta Srinivasa Rao )పరిశీలించారు.ఆ తర్వాత భవనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా , మీడియా ఛానళ్లలో వైరల్ గా మారడంతో, వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఘాటుగానే స్పందించింది.ఈ మేరకు వైసిపి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.” అవి ప్రభుత్వ భవనాలే, ప్రైవేట్ ఆస్తులు కావు.విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగా వీటిని కట్టింది.విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ( Chandrababu )1995 నుంచి ఓదరగొడుతున్నారు.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి విశాఖకు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనం లేదు.వీటి ఫోటోలను వైరల్ చేస్తూ బురద చల్లడం వెనక ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలుసు ‘ అంటూ రియాక్ట్ అయ్యింది.
ఋషికొండ వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్మాణాలు చేసిందని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు.కూటమి నేతలతో కలిసి ఆయన ఆ నిర్మాణాలను పరిశీలించిన అనంతరం ఎన్ జి టి ఆదేశాలను సైతం పక్కనపెట్టి ఈ నిర్మాణాలు చేపట్టారని, ప్రజాధనంతో జగన్ కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియదని విమర్శించారు.వైసిపి నేతల అక్రమాలతో పాటు, భూ దోపిడీ పైనా విచారణ చేయాల్సిన అవసరం ఉందని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.అయితే ఉద్దేశం పూర్వకంగానే ఏపీ ప్రభుత్వం తమను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోందని వైసిపే మండిపడుతోంది.