నాకు 1971లో నిశ్చితార్థం అయింది.పెళ్లి మాత్రం 1972లో అయింది.
నిశ్చితార్థానికి, పెళ్లికి ఒక ఏడాది గ్యాప్ వచ్చింది.నేను అప్పట్లో హైదరాబాద్ లో బీఎస్సీ చదువుతున్నా.
మా బాబాయి ఇంట్లో ఉండేదాన్ని.అతను ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ చదువుతున్నాడు.
అయితే ఏడాది అయితే అతని చదువు అయిపోతుంది, ఉద్యోగంలో చేరుతాడు.కనుక అప్పుడే పెళ్లి చేస్తే బాగుంటుందని మా పెద్దలు నిర్ణయించారు.
నాకు హాలిడేస్ వచ్చినప్పుడే అతనికి కూడా హాలిడేస్ వచ్చేవి.నేను వైజాగ్ వెళ్లేదాన్ని.
అతను తన సొంత ఊరు అనకాపల్లి వెళ్లేవాడు.అప్పుడప్పుడు అతను వైజాగ్ వచ్చి నన్ను కలిసేవాడు.
దీంతో వైజాగ్‌లో మేం సినిమాకో, బీచ్‌కో వెళ్లి గడిపేవాళ్లం.అయితే ఎక్కడికి వెళ్లినా సాయంత్రం 6 లోపు ఇంటికి వచ్చేయాలి అని మాకు అప్పట్లో ఇంట్లో ఆర్డర్ ఉండేది.
నిశ్చితార్థం కాగానే ఇద్దరం ఒకరికొకరికి వారానికి ఒక ఉత్తరం రాసుకోవాలని ముందే ప్రామిస్ చేసుకున్నాం.అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు.వాట్సాప్ మెసేజ్‌లు లేవు.కనీసం మా ఇండ్లలో ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు.
అప్పుడు కమ్యూనికేషన్ ఉత్తరాల ద్వారానే ఎక్కువగా జరిగేది.అయితే కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో, చెడు వార్తలను చెప్పడానికే 90 శాతం మంది అప్పట్లో టెలిగ్రాం సేవలను ఉపయోగించుకునేవారు.
చాలా అరుదుగా మంచి వార్తలకు టెలిగ్రాంలను వాడేవారు.ఎవరికైనా పాపో, బాబో పుడితేనో, లేదంటే పరీక్ష పాస్ అయితేనో, లేదా ఉత్తరం రాసే తీరిక లేక త్వరగా ప్రయాణమై ఎవరైనా వస్తుంటేనో మాత్రమే అప్పట్లో టెలిగ్రాంలను వాడేవారు.
ఇక నా అనుభవం విషయానికి వస్తే నేను మేం ముందుగా అనుకున్నట్లుగానే వారానికి ఒక ఉత్తరం రాసుకోవడం మొదలు పెట్టాం.

అయితే అది కాస్తా వారంలో రెండు సార్లకు చేరుకుంది.తరువాత రోజుకో ఉత్తరం రాసుకోవడం మొదలు పెట్టాం.దీంతో మాకు ఒకేసారి రెండు, మూడు ఉత్తరాలు వచ్చేవి.
కొన్ని సార్లు రెండు, మూడు రోజుల వరకు ఉత్తరాలు వచ్చేవి కావు.వస్తే మాత్రం ఎక్కువగా ఉత్తరాలు వచ్చేవి.
అయితే ఒకసారి ఏకంగా 5 రోజులు వరుసగా వేచి చూసినా నాకు అతని నుంచి ఉత్తరాలు రాలేదు.మరోవైపు నాలో టెన్షన్ మొదలైంది.
ఆయనకేమైనా జరిగి ఉంటుందేమోనని కంగారు పడ్డా.ఆ రోజు శనివారం.
అప్పటికే మధ్యాహ్నం అయింది.ఇక ఆ రోజు కూడా ఉత్తరం రాదని భావించి ఉండబట్టలేక వెంటనే అతనికి టెలిగ్రాం చేయాలని టెలిగ్రాం ఆఫీస్‌కు వెళ్లా.
టెలిగ్రాఫ్ ఆఫీస్‌కు వెళ్లడం నాకు అదే తొలిసారి.అయినా నాకు టెలిగ్రాం ఎలా చేయాలో చిన్నప్పుడు స్కూల్‌లో నేర్పించారు.కనుక నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.వెంటనే అక్కడ ఉన్న ఓ ఫాం తీసుకుని వివరాలను నింపడం మొదలు పెట్టా.
మెసేజ్ ఏమని పంపాలో ఫాంలో ఆ వాక్యాన్ని రాయాల్సి వచ్చింది.దీంతో నేను “No letters from one week stop Write immediately stop I am angry”.
అని రాశా.( వాక్యం మధ్యలో ఉన్న stop అంటే ఫుల్ స్టాప్ అని అర్థం.
ఫుల్‌స్టాప్‌కు టెలిగ్రాంలో చుక్క పెట్టకూడదు) కానీ పదాలు ఎక్కువ కావడంతో అందుకు అయ్యే చార్జి బాగా ఎక్కువైంది.దీంతో మరిన్ని పదాలను తగ్గించాలని మరొక ఫాం తీసుకుని నింపా.
అప్పుడు మళ్లీ… No letters from one week stop I am angry అని రాశా.అయినా ఆ వాక్యంలో పదాలు ఎక్కువగానే ఉన్నాయి.
దీంతో టెలిగ్రాం చార్జీ నా బడ్జెట్‌ను దాటి పోయింది.అయితే మరోసారి కొత్త ఫాం తీసుకుని మళ్లీ వివరాలను నింపా.
ఈ సారి అందులో “No letters one week stop am angry” అని రాసి టెలిగ్రాం పోస్ట్ చేశా.

అయితే టెలిగ్రాఫ్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే నేను చేసిన పనికి నాకే సిగ్గనిపించింది.ఎందుకంటే… అతని నుంచి ఉత్తరాలు రాలేదని చెప్పి, నాకు కోపం వచ్చిందని టెలిగ్రాం చేయడం ఎంత వరకు కరెక్ట్ ? ఒక వేళ నేను పోస్ట్ చేసిన టెలిగ్రాం ఆయన కాకుండా ఆయన రూంలో ఉండేవారు ఓపెన్ చేస్తే.అప్పుడు నాకు ముఖం ఎలా ఉంటుంది.
అని ఆలోచించా.అయినా అప్పటికే టెలిగ్రాం పోస్ట్ చేశా కనుక చేసేదేం లేక ఇంటికి వచ్చా.
అయితే ఇంటికి రాగానే 3 ఉత్తరాలు నాకు వచ్చాయి.పోస్టల్ డిలే కారణంగా ఉత్తరాలు నాకు చేరడం ఆలస్యం అయింది.
దీంతో నాకు మరింత సిగ్గనిపించింది.అనవసరంగా టెలిగ్రాం చేసి అతన్ని ఇబ్బంది పెట్టానని బాధ పడ్డా.
అయితే నా టెలిగ్రాం అందుకున్న ఆయన కూడా టెలిగ్రాం చేశారు.అందులో ఆయన బాగా నవ్వుకున్నట్లు తెలిపారు.
ఇప్పట్లో అయితే నవ్వు వస్తే వాట్సాప్‌లో ‘LOL’ or ‘ROFL’ అని పెడతారు.కానీ అప్పుడు ఉత్తరాల్లోనే ఆ భావాలను పంచుకునేవాళ్లం.
ఇక నా జీవితంలో నేను తొలిసారిగా, ఆఖరి సారిగా పంపిన టెలిగ్రాం అదే.ఇప్పటికీ నాకు కోపం వస్తే ఇంట్లో ఆయన అప్పటి టెలిగ్రాం సంఘటనను గుర్తు చేసుకుని నవ్వుతుంటారు.నన్ను ఆ విషయమై ఏడిపిస్తుంటారు.అయినా నాకు ఆ విషయం గురించి ఆయన నన్ను ఏడిపిస్తుంటే.కోపం మాత్రం రాదు.నాకు జీవితాంత గుర్తుండి పోయే మధుర జ్ఞాపకం అది.ప్రేమలో ఉన్నప్పుడు నిజంగా మనం ఒక్కోసారి ఏం చేస్తామో మనకు అర్థం కాదు.మనం ప్రేమించిన వ్యక్తులు కొన్ని రోజుల పాటు మనతో మాట్లాడకుండా ఉంటే కలిగిన పరిస్థితే నాకు అప్పుడు ఎదురైంది.! అది గుర్తుకు వచ్చినప్పుడల్లా నాక్కూడా నవ్వు వస్తుంటుంది.!
.