ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు తాగుడుకు బానిసై ఎంతటి ఘాతుకానికైనా పాల్పడడానికి సిద్ధ పడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి మద్యం తాగేందుకు తన తల్లి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా కన్నతల్లి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హత్య చేసినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని బోరంపేట మండలంలోని ఓ గ్రామంలో అశోక్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు కుటుంబాన్ని పోషించడం కోసం గ్రామంలోని తాపీ మేస్త్రి పనులకు వెళ్తుండేవాడు.
కాగా గత కొద్దిరోజులుగా లాక్ డౌన్ కారణంగా భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.అయితే తాజాగా కరోనా ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేపట్టడంతో అశోక్ మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తన తల్లిని అడిగాడు.
అయితే గత కొద్ది రోజులుగా ఎటువంటి పనులు లేకపోవడంతో తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ఆమె చెప్పింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి అశోక్ కన్నతల్లి అని కూడా చూడకుండా ఆమెని గొంతు నులిమి హత్య చేశాడు.
అయితే స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.అలాగే కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
నవ మాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తన కొడుకు కేవలం మద్యం కోసం కాలయముడుగా మారి కన్న తల్లిని హత్య చేయడం గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపింది.