తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా, అధికార పార్టీ టిఆర్ఎస్ కు పోటీ ఇచ్చే అవకాశం లేకపోయినా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ను అడుగడుగున ఇబ్బంది పెడుతూ, రాజకీయంగా చేస్తున్న విమర్శలు కానీ, చర్యలు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా ఇబ్బందికరంగా మారాయి.కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా, వారు ఎవరూ కేసీఆర్ పై ఆ స్థాయిలో విమర్శలు చేయలేకపోవడం తో రేవంత్ వాయిస్ గట్టిగా వినిపిస్తోంది.
దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసీఆర్ ను ఢీ కొట్టగలిగిన సమర్ధుడైన నాయకుడు గా రేవంత్ రెడ్డికి అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తోంది.సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతా, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నా, ఎప్పటికప్పుడు ప్రాధాన్యం కల్పిస్తూ, ప్రోత్సహిస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే, త్వరలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు, అన్ని నియోజకవర్గాలను చుట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దీనికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో, రేవంత్ స్పీడ్ గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే రేవంత్ ఎక్కడ నుంచి పాదయాత్ర మొదలు పెడతారు అనే విషయంపై అందరికీ అనేక అనుమానాలు ఉండగా, రేవంత్ మాత్రం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని, అక్కడి నుంచే కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి సొంత నియోజకవర్గంలో గట్టి ఎదురు దెబ్బ తీయాలనే ప్లాన్ లో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

గజ్వేల్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి సిద్దిపేట, సిరిసిల్ల తో పాటు, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వరకు పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది .ఇప్పటికే రేవంత్ చేపట్టిన రైతు భరోసా యాత్ర కు విశేషమైన స్పందన వచ్చిన నేపథ్యంలో, తెలంగాణ అంతటా అదికూడా, కెసిఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి ప్రారంభించి కెసిఆర్ కు ముచ్చెమటలు పట్టించాలనే విధంగా రేవంత్ ప్లాన్ చేస్తున్నారట.