రోజురోజుకి మనుషులలో అసహనం పెరిగిపోతుంది.వారిలో కోపాలు హద్దులు దాటుతూ చంపుకునేంత వరకు వెళ్తున్నాయి.
కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, భార్య భర్తలు, తండ్రి కొడుకుల మధ్య కూడా ఇలాంటి ప్రతీకార దాడులు పెరిగిపోతున్నాయి క్షణికావేశం కుటుంబంలో ఒకరి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది.బలమైన కుటుంబ వ్యవస్థకి ఉదాహరణగా చూపించే భారత దేశం ఆ పేరుని పోగొట్టుకునే స్థాయికి కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయి.
ప్రతి రోజు ఎక్కడో ఒక చోట కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, హత్యలు అనేవి సహజంగా వినిపిస్తున్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో దారుణం జరిగింది.
జాతీయ స్థాయిలో షూటింగ్ పోటీల్లో పాల్గొన్న ఓ అమ్మాయి తన కుటుంబ సభ్యులను కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.
లక్నోలోని గౌతమ్ పల్లి ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.
ఓ సీనియర్ రైల్వే అధికారి కుమార్తె తన తల్లి మాలిని బాజ్ పాయి, సోదరుడు శరద్ లను తుపాకీతో కాల్చింది.ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
కాల్పులకు పాల్పడిన బాలిక పదో తరగతి చదవుతోంది.కొంతకాలంగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని వెల్లడైంది.
కాల్పులు జరిపిన అనంతరం ఆ బాలిక బ్లేడుతో కోసుకుని బలవన్మరణానికి యత్నించింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కొద్దిపాటి గాయాలైన ఆ బాలికకు చికిత్స అందిస్తున్నారు.స్పోర్ట్స్ లో సరిగ్గా రాణించకపోవడం వలన ఆమె మానసిక స్థితి దెబ్బ తిని, అసహనంతో కుటుంబ సభ్యుల మీద దాడి చేసినట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా చిన్న చిన్న సమస్యలని కూడా నేటి యువత తట్టుకోలేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉండటం కలవరపెట్టే విషయం.