సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) ఎడమ కాలువ చివరి ఆయకట్టు రైతులు సాగు నీటి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.ఈ ప్రాంతం కృష్ణానది పక్కనే ఉన్నా రైతులకు ఖరీఫ్సా గు కష్టాలు తప్పడం లేదు.
సాగర్ జలాశయం నీటిమట్టం కనిష్ట స్థాయికి పడిపోవడం,సకాలంలో వర్షాలు పడకపోవడంతో చెరువులు,బావులు సైతం అడుగంటి సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టు రైతాంగం యొక్క ఖరీఫ్ సీజన్ ప్రశ్నార్థకంగా మారిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
హుజుర్ నగర్( Huzur Nagar ) నియోజకవర్గంలో సాగర్ నీటితో పాటు కురిసే వర్షాలతో చెరువులోని నీటిని ఆసరాగా చేసుకొని రైతులు వరిసాగు చేస్తారు.
ఈక్రమంలో చెరువుల్లో, బావుల్లో నీరు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.వర్షా కాలంలో కూడా ఎండలు విపరీతంగా మండిపోతుండటంతో ఇటీవల వేసిన వరి పంటలకు తడులు ఎక్కువగా అవసరమవుతున్నాయి.
చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో వేసిన పంటలు కాపాడుకునేందుకు రైతులు పొదుపుగా వాడుకుంటూ పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.మరో వారం రోజుల పాటు చెరువులోకి నీరు రాకపోతే ఈ ప్రాంత పంటలకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఒక్కో రైతు పంటలకు లక్షల్లో పెట్టుబడులు పెట్టి వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.చెరువులో నీరు అడుగంటుతుండటంతో బోరు బావుల్లో కూడా నీటి పరిమాణం నిత్యం తగ్గుతుండటంతో రైతులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.
పనులు పూర్తయి పొలాలు తడిసేనా…? నియోజకవర్గంలోని నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద చింతలపాలెం మండలం వెల్లటూరు, పాలకవీడు మండలం గుండెబోయినగూడెం కృష్ణానది వద్ద ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చేందుకు కాలువల మరమ్మతుల లైనింగ్,లిఫ్ట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఎన్ఎస్పి కాలువలకు మరమ్మతులు పూర్తిచేసి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ ద్వారా నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1217.71 కోట్లతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.ఏ ఆటంకాలు లేకుండా పనులు జరిగితే రెండేళ్లులో పూర్తయ్యే అవకాశం ఉంది.
అదే జరిగితే నియోజకవర్గంలో చివరి ఆయకట్ట రైతుల కష్టాలు తీరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని రైతులు చెబుతున్నారు.సాగర్ నీరు విడుదల చేయాలి చివరి ఆయకట్ట రైతుల పంటలను కాపాడేందుకు నీటినీ విడుదల చేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.జలాశయంలో నీటి నిలువలు నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వను పరిశీలిస్తే వానాకాలం పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 140 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.డెడ్ స్టోరేజ్ కింద 132 టీఎంసీలు తీసేస్తే 8 టీఎంసీలు మాత్రమే ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో అన్నదాతల ఎదురు చూపులు ఎలా ఫలిస్తాయో అర్దంకాని స్థితి నెలకొంది.