ఏంటి, ఇది జోక్ అనుకుంటున్నారా? లేకపోతే ఒక పండు లక్ష రూపాయిలు ఏమిటి అని ప్రశ్నిస్తారా? మీరు ఇక్కడ విన్నది నిజమే.ఆ పండు అక్షరాలా లక్ష రూపాయలకు పైమాటే.
వేసవి కాలం వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్లు మన మార్కెట్లో దర్శనమిస్తాయి.వేసవి కాలంలో అత్యధికంగా లభించే సీజనల్ పండు ఏమిటి అంటే అందరికీ గుర్తొచ్చేది మామిడి మాత్రమే.
APలో మామిడి పండ్లు డజన్ల రూపంలో, కిలోల రూపంలో అమ్మకాలు జరుగుతుంటాయి.ఇక్కడ కొన్ని రకాలు డజను గరిష్టంగా ఓ వెయ్యిరూపాయలు నుంచి 2 వేల వరకు గరిష్ట ధర పలుకుతుంది.
అంతకు మించి అయితే నూజివీడు ఎక్స్ పోర్ట్ క్వాలిటీ మామిడి పండ్లు ఇంకాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.
కానీ ఒక్కో మామిడి ఏకంగా లక్షరూపాయలు పలకడం ఎక్కడైనా విన్నారా? మమ్ములుగా ఎవరూ చూసుండరు.కానీ కాకినాడ జిల్లాలో మాత్రం ఓ రైతు ఇంత భారీ రేటు పలికే మామిడి పండ్లను సాగుచేస్తున్నాడు.జపాన్ దేశానికి చెందిన ‘మియాజాకీ‘ అనే జాతికి చెందిన మామిడిపండ్లు అతను సాగు చేస్తున్నాడు.వీటికి మన దేశంలో లక్షలరూపాయల్లో ధర పలుకుతోంది.దీంతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు తనకు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో తనకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఈ మియాజాకీ జాతికి చెందిన మామిడిపండ్లు పండిస్తున్నారు.

ఈ మామిడి విత్తనాన్ని జపాన్ దేశంనుండి తీసుకొచ్చినట్లు రైతు ఓదూరి నాగేశ్వరరావు లోకల్ యాప్ కు తెలిపారు.ఈ సీజన్ లో పంట చేతికి కూడా వచ్చిందని, ఈ మియాజాకీ రకం మామిడిపండులో పోషకవిలువలు చాలా అధికంగా ఉంటాయని, ఒక్కో పండు మూడునుంచి నాలుగొందల గ్రాముల బరువు ఉంటుందని, అందుకే ఈ మధురఫలానికి ప్రంపంచమార్కెట్లో కిలో రెండున్నర లక్షల రూపాయల వరకూ ధర ఉందని నాగేశ్వరరావు తెలిపారు.ఇవే కాకుండా తమకు ఉన్న నాలుగెకరాల పొలంలో ప్రపంచంలో ఉన్న వివిధరకాల మామిడిపండ్లను తాను, తన కుమారుడు కిశోర్ కలిసి, స్వయంగా పండిస్తున్నామన్నారు.