తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది బిజెపి. బీఆర్ఎస్ పార్టీ పాలనకు చరమగీతం పాడి, తాము అధికారంలోకి రావాలనే పట్టుదల బిజెపి నాయకులలో కనిపిస్తుంది.
దీనికి తగ్గట్లుగానే రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు, కేంద్ర బిజెపి పెద్దలు చేరికల పైనే ఎక్కువ దృష్టి సారించారు.ఈ మేరకు చేరికల కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించారు.
అయితే బిజెపి కేంద్ర పెద్దలు ఆశించిన స్థాయిలో అయితే చేరికలు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది.ఇక బిజెపిలో చేరదామని కొంతమంది బీఆర్ఎస్ లోని కీలక నాయకులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే, వారి చేరికలకు సంబంధించిన లీకులు బయటకు వస్తుండడం తో చివరికి ఆ చేరికలు కాస్తా వాయిదా పడుతూ వచ్చిన ఘటనలు ఎన్నో జరిగాయి.
అలాగే కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బిజెపి నేతలు భావించినా ఆ చేరికలు అంతంతమాత్రంగానే ఉండడంతో బిజెపిలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అయితే బీజేపీ లోని కొంతమంది కీలక నాయకులే ఈ చేరికలకు సంబంధించిన లీకులు ఇస్తున్నారని, కొంతమంది చేరేందుకు వస్తున్న, వారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపించకపోవడం వంటి ఘటనలపై తెలంగాణ బీజేపీ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సోదరుడు రామచంద్ర కాంగ్రెస్ ను వీడి బిజెపిలోకి వెళ్లేందుకు జనవరి 26 ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట.

ఈ మేరకు తన అనుచరులతో బీజేపీ ఆఫీస్ కు రామచంద్ర వెళ్లారట కానీ ఆరోజు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అందుబాటులో లేకపోవడంతో, ఆ తర్వాత రోజు బిజెపిలో చేరాలని ప్రయత్నించారట.కానీ బండి సంజయ్ ఆరోజు కూడా ఆఫీసుకు రాకపోవడంతో అక్కడే ఉన్న కొంతమంది నేతలను కలిసి రామచంద్ర వెళ్ళిపోయారట.అయితే రామచంద్ర చేరికను బిజెపిలో ఉన్న ఓ మాజీ మంత్రి వ్యతిరేకించడంతోనే ఆయన్ను చేర్చుకునేందుకు బండి సంజయ్ సైతం ఆసక్తి చూపించలేదట.
రామచంద్ర పార్టీలో చేర్చుకుంటే తన టికెట్ కు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయంతో ఆ మాజీ మంత్రి సంజయ్ పై ఒత్తిడి చేయడంతో , ఆ చేరిక నిలిచిపోయిందట.

అయితే రామచంద్ర మాత్రం ఆ మాజీ మంత్రి నియోజకవర్గంలో తాను పోటీ చేసేందుకు ఆసక్తిగా లేనని, తాను వేరే నియోజకవర్గం చూసుకున్నానని, అవసరమైతే ఈ విషయంపైనే బాండ్ పేపర్ కూడా రాసిస్తానని, తన చేరుకుని వ్యతిరేకిస్తున్న ఆ మాజీ మంత్రి తో పాటు, బీజేపీ లోని కొంతమంది కీలక నాయకులు వద్ద ప్రస్తావించారట.ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ బిజెపిలో హాట్ టాపిక్ గా మారింది.పార్టీలో చేరేందుకు నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకులు వస్తున్నా, చేర్చుకునేందుకు ఆసక్తి చూపించకపోతే తెలంగాణలో బిజెపి ఏ విధంగా బలోపేతం అవుతుందనే ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచి సంజయ్ కు ఎదురవుతోందట.