హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలిచేందుకు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నో వ్యూహాలను అమలు చేసింది.చివరకు ఈ నియోజకవర్గంలో దళిత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని గుర్తించి, ఆ వర్గానికి మేలు జరిగేలా చేయగలిగితే తప్పకుండా విజయం తమకే దక్కుతుందని అంచనా వేసింది.
దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు .ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గం లో అమలు చేస్తామని ప్రకటించడమే కాకుండా , కొంతమందికి ఈ పథకాన్ని అమలు చేశారు . ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో, దళిత బంధు పథకం కి బ్రేక్ పడింది.
లక్షల కోట్ల బడ్జెట్ ఈ పథకం అమలు కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధం అని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ కేసీఆర్ సైతం అనేక సందర్భాల్లో ప్రకటించారు.
అయితే ఎన్నికల్లో ఫలితం బోల్తా కొట్టడంతో ఈ దళిత బంధు పథకం అమలు చేస్తారా లేక పక్కన పెట్టేస్తారు అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడం అసాధ్యమని, ఏదో ఒక కారణంతో దీనిని వాయిదా వేసే విధంగా కెసిఆర్ ఎత్తుగడలు వేస్తారనే అభిప్రాయం జనాలలోను మొదలైంది.
అయితే ఇదే దళిత బందు పథకాన్ని ఉపయోగించుకుని టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బిజెపి సిద్ధమవుతోంది.ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగిపోయారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే అమలు చేయాలని అలా చేయకపోతే ఊరుకునేది లేదు అంటూ ఆయన హెచ్చరికలు చేశారు.రాష్ట్రమంతా దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే తాము ఉద్యమాన్ని మొదలు పెడతాము అంటూ ఆయన ప్రకటించేశారు.ఇక ఇదే పథకాన్ని ఉపయోగించుకుని టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బిజెపి వ్యూహాలు రూపొందించుకోవడం తో టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది .ఈ పథకాన్ని అమలు చేయాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ అవసరమవుతుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ ను కేటాయించే పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోవడం బిజెపికి బాగా కలిసి రాబోతోంది.