రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం * వేములవాడ రాజన్న ని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం గావించగా, ఈ.ఓ వినోద్ రెడ్డి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ పార్వతీ- పరమేశ్వరుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలతో రైతులు విరాజిల్లాలని రాజన్నను దర్శించుకుని వేడుకోవడం జరిగిందని అన్నారు.కోడెను కడితే కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆశీస్సులతో ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే రూ.127కోట్లతో పనులకు శ్రీకారం చుట్టామని, పనుల్లో ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండా త్వరగా పూర్తయి భక్తులకు మెరుగైన వసతులు కలిగేలా చూడాలని స్వామివారితో పాటు అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.