నల్లగొండ జిల్లా:గట్టుప్పల్ మండలం( Gattuppal ) శేరిగూడెం అంగన్వాడి సెంటర్లో బాలింతలకు,గర్భిణీ స్త్రీలకు,చంటి పిల్లలకు అందించే పౌష్టికాహారంలో పురుగులు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…గత శనివారం అంగన్వాడి కేంద్రంలో వండిన పౌష్టికాహారంలో పురుగులు వచ్చాయన్నారు.
గతంలో కూడా సుచి,శుభ్రత లేకుండా పెట్టిన ఆహారం తిని మా పిల్లలు వాంతులు చేసుకున్నారని మహిళలు, తల్లిదండ్రులు వాపోయారు.
అప్పుడే ఇదేంటని అడిగితే అంగన్వాడి కార్యకర్త,ఆయా పొంతనలేని సమాధానాలు చెబుతూ,వచ్చిన ఆహారం వండి పెడుతున్నాం,మా ఇంట్లో నుండి తెచ్చి మీకు పెట్టాలా అంటూ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు.
మళ్లీ ఇప్పుడు కూడా అదే విధంగా శుభ్రతలేని ఆహారం పెడుతున్నారని,అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే అంగన్వాడీ సెంటర్( Anganwadi Centre ) ఈగల దిబ్బగా మారిందని,విధులు నిర్వహించే కార్యకర్త, ఆయాలు అడిగేవారు లేరని ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి,పిల్లలు,మహిళలు అనారోగ్యం బారిన పడక ముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.