నల్లగొండ జిల్లా:మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని ఎన్నికని,ఓ యుద్ధాన్ని తలపించేలా జరిగిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు,దుర్మార్గంగా ముఖ్యమంత్రి కేసీఆర్,టిఆర్ఎస్ ప్రభుత్వం దీనిని ఆధర్మ యుద్ధంగా మార్చి,అధికార దుర్వినియోగం చేశారన్నారు.మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడించడం కోసం150 మంది ప్రజాప్రతినిధులు గ్రామానికి ఒకరు చొప్పున ఉండి ప్రజలపై వత్తిడి తీసుకొచ్చి కొద్ది మెజారిటీతో గెలిచారని, న్యాయంగా,ధర్మంగా రాజగోపాల్ రెడ్డి గెలిచాడని సమాజం మొత్తం చెప్తుందన్నారు.
ఈ మునుగోడులో యుద్ధం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.మునుగోడులో మొదలైన యుద్ధం కేసీఆర్ ని గద్దె దింపే వరకు కొనసాగుతూనే ఉంటుందని, కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజు ముందే ఉందని,రాబోయే రోజుల్లో మరో ధర్మ యుద్ధం ఉంటుందని, భయపడి ఓడిపోయామని ఇంట్లో కూర్చునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.
మునుగోడు మండలంలో 50 వేల ఎకరాలకు నీరందించే ఉదయ సముద్రం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని,కానీ,ఆ తీర్పు రావడానికి మీరు చేసిన దౌర్జన్యాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.కేసీఆర్ ఓ పెద్ద దొంగ అని,అన్ని అబద్ధాలే ఆడుతాడని,కేటీఆర్ ఓ అహంకారి అని,జగదీష్ రెడ్డి చేతగాని ఒక బానిస మంత్రి అని,గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక దద్దమ్మని మండిపడ్డారు.100% మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని,మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తెలంగాణలోనే నెంబర్ వన్ గా చేసేంతవరకు ఇక్కడే ఉంటానని,గెలిచినా,ఓడినా రాజగోపాల్ రెడ్డి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడని అన్నారు.మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ గెలుపును గెలుపు కింద భావిస్తలేరని,గెలిచిన నాయకుణ్ణి ఎమ్మెల్యేగా భావించడంలేదని ఎద్దేవా చేశారు.మీరు అభివృద్ధి చేయకపోతే మాత్రం మిమ్మల్ని మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టనీయమని,ఉమ్మడి నల్గొండ జిల్లాలో చీము నెత్తురు లేని బానిస బతుకులు బతుకుతున్న ఎమ్మెల్యేలు నన్ను ఓడకొట్టడానికి ఇక్కడికి వచ్చారని,అవినీతి సొమ్ము,మద్యం,ప్రలోభాలు,ఒత్తిడి, బలవంతం,బలప్రయోగం చేసి గెలిచిన గెలుపుగాని మీ గెలుపు కాదని విమర్శించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడానికి సూర్యాపేట నుంచి నా ప్రచారం స్టార్ట్ చేస్తానని,మీరు ఈసారి గెలిచింది నిజమైన గెలుపు కాదని,మీరు 100 మంది నేను ఒక్కడినని,ఇక మీదట బీజేపీ సత్తా ఏమిటో,రాజ్ గోపాల్ రెడ్డి ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.