నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రోఫెసర్ జయశంకర్ బడిబాట( Jayashankar Badibata )లో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి( Bathula LaxmaReddy ) పాల్గొని ప్రారంభించి, పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.మిర్యాలగూడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వర్షం వస్తే స్కూల్ పరిసరాలు బురదగా మారి విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వెంటనే మట్టిని పోయించి చదును చేయించారు.
అలాగే దామరచర్ల మండల కేంద్రంలో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వచ్చేలా పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కావద్దని,సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యతో పాటు,ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా విద్యార్థులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.మేము కూడా నెలలో ఒకటి, రెండు రోజులు అకస్మిక తనిఖీలు చేస్తామని, విద్యాబోధన,విద్యార్థుల క్రమశిక్షణపై పిల్లలతో పాటు,పేరెంట్స్ ను అడిగి తెలుసుకుంటామని,డ్యూటీకి రాకున్నా,విధులు సక్రమంగా నిర్వహించకున్నా ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యతను పాటిస్తూ, విద్యార్థులు తినేలా మెనూ పాటించాలన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను ప్రకటించిన విధంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 29 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే అయాలకు నా జీతం నుంచి వేతనంగా ఇస్తానని పునరుద్ఘాటించారు.
అతిత్వరలో ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతి ఫలితాల్లో 10/10 మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి, ప్రత్యేక బహుమతులు అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు,ఉపాధ్యాయులు,విద్యార్దులు,కాంగ్రెస్ నాయకులు,బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.