నల్గొండ జిల్లా:దళిత బంధు పథకాన్ని ఎమ్మెల్యేల చేతిలో పెట్టొద్దని బీజేపీ ఎస్సీ మోర్చా నల్లగొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు.గురువారం ఉదయం కేతేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యక్రమాల సెల్ కో కన్వీనర్ చినేని జానయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎస్సీ మహిళలతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే దళిత వర్గాలు గుర్తుకు వస్తారని,ఎన్నికలు అయిపోగానే ఎస్సీలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం పదే పదే చూస్తున్నామన్నారు.హుజురాబాద్ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20లక్షల కుటుంబాలకు దళిత బంధు పధకం ద్వారా 10 లక్షల రూపాయలు అందించి అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పారని,ఇప్పుడు ఆ పథకాన్ని అంచెలంచెలుగా నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అధికారుల ద్వారా ఇవ్వాల్సిన పథకాన్ని ఎమ్మెల్యేల ద్వారా కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆరోపించారు.దళిత బంధు పధకం నిష్పక్షపాతoగా అర్హులైన వారందరికీ అందించేవరకు బీజేపీ ఎస్సీ మోర్చా ఎస్సీల పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాటం చేసి ఎస్సీలకు లబ్ది చేకూరేలా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అయితగోని అనిత,బొజ్జ సుధాకర్, నాగరాజు,బండిపెళ్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.