ఈ మధ్య కాలంలో ఈ కామర్స్ వెబ్‌సైట్లు కస్టమర్లకు షాకులమీద షాకులు ఇస్తున్నాయి.మొబైల్ బుక్ చేసినవారికి ఇనుప కడ్డీలు, లాప్ టాప్స్ బుక్ చేసిన వారికి రాళ్ళూ రప్పలు పార్సిల్ చేస్తున్నాయి.
సరిగ్గా అలాంటి వింత అనుభవమే ఓ కస్టమర్ కి తాజాగా ఎదురైంది.ల్యాప్‌టాప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యక్తికి రాయితోపాటు కొన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు డెలివరీ అయ్యాయి.
దాంతో అతగాడు ఖంగుతిన్నాడు.
వివరాల్లోకి వెళితే, దీపావళి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి కదాని, కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం అక్టోబరు 15న ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఓ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.
అనుకున్న సమయానికి అది డెలివరీ అవడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.తీరా పార్సిల్ తెరచి చూస్తే.అందులో రాయి, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉండటం చూసి మొదట వారు మూర్ఛపోయారు.ఆ తరువాత తేరుకొని కస్టమర్‌కేర్‌కి ఫోన్ చేసి సమస్యను చెప్పారు.
అయినా ఉపయోగం లేకపోయింది.
అయితే వారు దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసారు.దాంతో అవి వైరల్‌గా మారాయి.ఇకపోతే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగడంతో ఈ కామర్స్ సంస్థలు ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి.
దానర్ధం, కస్టమర్ కోరికమేరకు ఐటమ్ డెలివరీ చేసేముందు డెలివరీ చేసే వ్యక్తి పార్సిల్‌ను తెరిచి చూపించాల్సి ఉంటుంది.తాజా ఘటనలో ఆ వ్యక్తి ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోలేదు.
దాంతో ఓపెన్ బాక్స్ డెలివరీ ఎంచుకోనందున రిఫండ్ ఇవ్వడం కుదరదని డెలివరీ సంస్థ తేల్చిచెప్పడంతో.ఈ కామర్స్ సంస్థకు ఫిర్యాదు చేశాడు.ఎట్టకేలకు ఈ కామర్స్ సంస్థ జోక్యం చేసుకోవడంతో మొత్తం సొమ్మును రిఫండ్ వచ్చింది.