ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకరు.శాసనసభకు ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, దివంగత సీఎం వైఎస్ఆర్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.అంతేకాకుండా వైఎస్ కోటరీ వ్యక్తిగా కూడా గుర్తింపు సాధించారు.
ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించడంలో ధర్మాన ప్రసాదరావు దిట్ట.
ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేసిన ధర్మాన మంచిగా పనిచేస్తారనే పేరు ఉంది.
చక్కని నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు సేవలు అందించి రెవెన్యూ శాఖను అప్పట్లో ధర్మాన ప్రసాదరావు మరింత చేరువ చేశారు.ముఖ్యంగా అవినీతి విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మాన ప్రసాదరావు మార్క్ కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఆయనకు ఎన్నో చేయాలని ఉన్నా.
ఏమీ చేయలేకపోతున్నా రని ధర్మాన సన్నిహితులు చెప్తున్నారు.
ఇటీవల కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ధర్మానకు రెవెన్యూ శాఖ ఇవ్వగానే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని.ఇక నుంచి బాధ్యతగా పనిచేద్దామని అధికారులకు పిలుపునివ్వడం సొంత పార్టీలో వ్యతరేకతకు కారణమైంది.
అప్పటి నుంచి ధర్మాన నోరు విప్పడం లేదు.దీంతో ఆయన మంత్రిగా ఫెయిలవుతూ వస్తున్నారు.
గుంపులో గోవిందంగా మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ధర్మానకు అధిష్టానం దగ్గర ఫ్రీ హ్యాండ్ లేదని ప్రచారంలో ఉంది.ఇదే ఆయన పనితనంపై ఎఫెక్ట్ చూపుతోందని టాక్ నడుస్తోంది.అటు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన నాలుగు స్థానాల్లో తన వర్గానికి చెందిన నేతలను బరిలో నిలిపేందుకు ధర్మాన ప్రసాదరావు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన అనుచరులను నిలపడం ద్వారా సొంత జిల్లాలో పట్టు సాధించాలని ధర్మాన కసరత్తులు చేస్తున్నారు.ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఓ క్లారిటీకి వచ్చిన ధర్మాన ప్రసాదరావు… శ్రీకాకుళం, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఓటములు, అభ్యర్థులపై ఓ నివేదికను కూడా పార్టీ అధిష్ఠానానికి సమర్పించినట్లు తెలుస్తోంది.