విదేశాల్లో మెడికల్ కోర్సు చదవాలని మనదేశంలోని యువత కల.అక్కడ డాక్టర్ విద్యను పూర్తి చేసి స్వదేశంలో ప్రాక్టీస్ ప్రారంభించాలని భావిస్తుంటారు.
అందుకే చాలామంది భారతీయ విద్యార్థులు స్వదేశంలో కంటే విదేశాల్లోనే వైద్య విద్య కోసం పరుగులు పెడుతుంటారు.ఈ కోవలో చైనాలో పెద్ద సంఖ్యలో మనదేశ విద్యార్ధులు ఎంబీబీఎస్ అభ్యసిస్తున్నారు.
భారత్‌లో ఎంబీబీఎస్ సీటు పొందడం కష్టంతో కూడుకున్న పని, ఖర్చు కూడా ఎక్కువే.దీంతో మెడిసిన్ చదవాలని భావించే వారు తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో చైనా లాంటి దేశాల వైపు చూస్తున్నారు.
కాస్త ఖర్చు పెడితే చాలు అత్యాధునిక వసతులు, ల్యాబోరేటరీలు, అద్భుతమైన ఫ్యాకల్టీ సాయంతో చైనాలో వైద్య విద్యను పూర్తి చేయొచ్చు.
అయితే కోవిడ్ మహమ్మారి ఇలాంటి వారి ఆశలపై నీళ్లు చల్లింది.
వైరస్ వెలుగు చూసిన తర్వాత విదేశీ విద్యార్ధులు తమ దేశంలో అడుగుపెట్టేందుకు చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.దీనిపై భారత్ పలుమార్లు దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ డ్రాగన్ మాత్రం కనికరించడం లేదు.
ఈ పరిణామాల కారణంగా దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్ధులు రెండేళ్లుగా ఇళ్లలోనే మగ్గుతున్నారు.ఇది వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర దేశాల వారికి ఇటీవల కాలంలో వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించిన చైనా.భారతీయుల విషయంలో మాత్రం జాప్యం చేస్తూ వచ్చింది.
ఈ విషయమై భారత అధినాయకత్వం పలుమార్లు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది కూడా.అంతేకాదు.
చైనా విశ్వవిద్యాలయాలలో చేరొద్దని మన దేశానికి చెందిన విద్యార్ధులను హెచ్చరించింది.ఈ మేరకు నేషనల్ మెడికల్ కమీషన్ (ఎన్ఎంసీ) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

ఈ దెబ్బకు దిగొచ్చిన చైనా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.దాదాపు రెండేళ్ల తర్వాత భారతీయ విద్యార్ధులను మళ్లీ తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.ఈ దిశగా వీసా జారీ ప్రక్రియ పున: ప్రారంభించబోతున్నట్లు డ్రాగన్ తెలిపింది.చైనాలో తప్పనిసరిగా చదవాల్సిన విద్యార్థుల జాబితాను పంపించాలని భారత ప్రభుత్వానికి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి సూచించారు.