యాదాద్రి భువనగిరి జిల్లా: రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన రైతు మిర్యాల నర్సయ్య తన భూమి వేరే వాళ్ళ పేరుపై పట్టాదారు పాస్ బుక్ లు ఇచ్చారని రిలే నిరాహార దీక్ష చేపట్టాడు.ఆ రిలే నిరాహార దీక్షలో రైతు మిర్యాల నర్సయ్య (70) మరణించడంతో కుటుంబ సభ్యులు,బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడు పొట్టిమర్రి చౌరస్తాలో రోడ్డుపై ధర్నాకు దిగారు.రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా తమకు అన్యాయం జరిగినప్పుడు స్పందించని అధికారులు ఇప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే మృతుడు మిర్యాల నర్సయ్య కుటుంబ సభ్యులు గతంలో యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో పురుగుల మందు డబ్బాలతో వచ్చి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.అప్పటి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ విచారణకు ఆదేశించారు.
కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కిన అధికార యంత్రాంగానికి చలనం లేకపోవడంతో బాధితుడు మిర్యాల నర్సయ్య కుటుంబ సభ్యులతో గత 14 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తూ మరణించాడు.అధికారుల తీరుపై ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు,బంధువులు శుక్రవారం ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడాతూ తమ భూమిని వేరే వాళ్ళు అక్రమంగా కబ్జా చేస్తే అధికారులు వారికి వత్తాసు పలకడంతో తాము కోర్టు మెట్లు ఎక్కామని,కేసు కోర్టులో ఉండగానే అధికారులు కబ్జా దారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారని ఆరోపించారు.ఇదే విషయమై గత 14 రోజుల నుండి కుటుంబ సభ్యులం తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేసినా అధికారులు స్పదించకపోవడంతో తమ కుటుంబ పెద్ద గుండె ఆగి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు స్థానిక తహశీల్దార్ అది కోర్టు పరిధిలో ఉంది తామేమీ చేయలేమని చెబుతున్నారని,అలాంటప్పుడు వేరే వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు.ఈ భూమి విషయంలో అధికారులు చేసిన నిర్లక్ష్యానికి తమ కుటుంబం ఇద్దరు వ్యక్తులను కోల్పోయిందని,వారి ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ భూమిపైకి ఒకడొచ్చి ఎమ్మెల్యే మనిషి అంటూ బెదిరిస్తాడు,ఇంకొకడు వచ్చి ఇంకో విధంగా బెదిరిస్తాడు,అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందా లేక నియంతృత్వ వ్యవస్థ ఉందా అర్థం కావడం లేదని,తాము తెలంగాణలో పుట్టడమే తప్పా అని ఆందోళన వ్యక్తం చేశారు.ఇన్ని రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకుని అధికారులు,పోలీసులు ఇప్పుడు ధర్నా చేస్తుంటే అడ్డుకోవడం చూస్తుంటే అధికారులు మొత్తం భూ కబ్జాదారులకు,రియల్ ఎస్టేట్ మాఫియాకు తొత్తులుగా మారిపోయారని అనిపిస్తుందన్నారు.
తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు.ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కేవలం భూమి కోసం న్యాయమైన పోరాటం చేస్తూ ఒక కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోవడం పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.