సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఇంద్రజ ఈ మధ్య కాలంలో బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.నిన్నటి తరం నటీమణుల్లో ఒకరైన ఇంద్రజ ఖాతాల్లో విజయాలు ఉన్నా నటిగా ఇంద్రజ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
ఒకవైపు బుల్లితెర షోలతో బిజీగా ఉంటూనే వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆఫర్లతో ఇంద్రజ బిజీ అవుతున్నారు.
తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన ఇంద్రజ ఆ షోలో మాట్లాడుతూ తనను ఇంట్లో అందరూ కనకలక్ష్మి అనే పిలిచే వారని నాన్నమ్మ పేరు కనకలక్ష్మి కావడంతో తనను అలా పిలిచేవారని ఆమె అన్నారు.
తనకు చదువుకోవాలని ఉండేదని అయితే కుటుంబ బాధ్యతల వల్ల తాను చదువుకోలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు.హీరోయిన్ కాకపోతే సైంటిస్ట్ లేదా జర్నలిస్ట్ అయ్యేదానినని ఆమె వెల్లడించారు.
తనకో అన్నయ్య ఉంటే అన్నయ్యకు ఫ్యామిలీ బాధ్యతలకు అప్పజెప్పి బాగా చదువుకుని ఉండేదానినని ఆమె చెప్పుకొచ్చారు.అమ్మ మ్యూజిక్ టీచర్ అని ఇంట్లో పిల్లలు సంగీతం నేర్చుకుంటుంటే తనకు కూడా సంగీత జ్ఞానం వచ్చిందని ఇంద్రజ తెలిపారు.
తనకు తన భర్తకు ఏదైనా గొడవ వస్తే శుభలగ్నం సినిమాలోని చిలకా ఏ తోడు లేక పాట గుర్తుకు వస్తుందని ఆమె వెల్లడించారు.

ఆ పాట వల్ల ఏ గొడవ జరిగినా తాను వెంటనే ఆలోచించుకుని వెనక్కు తగ్గుతానని ఆమె అన్నారు.కొంత సమయం ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని భావిస్తానని ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం అందించిన పాటలు అన్నీ ఇష్టమని ఎస్వీ కృష్ణారెడ్డి పాటల కలెక్షన్ తన దగ్గర ఉందని ఆమె చెప్పుకొచ్చారు.బుల్లితెర షోల ద్వారా ఈ మధ్య కాలంలో ఇంద్రజకు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.