బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్ మాఫియా చుట్టుముట్టింది.డ్రగ్స్ కేసులో భాగంగా పలువురు హీరోయిన్లను అధికారులు విచారించిన సంగతి మనకు తెలిసిందే.
ఇది మరవకముందే శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు కన్నడ భామలను చుట్టుముట్టింది.ఈ కేసులో భాగంగా కన్నడ హీరోయిన్ సంజన, రాగిణి లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి మనకు తెలిసిందే.
అరెస్టయిన రాగిణి, సంజన లను అగ్రహార సెంట్రల్ జైలులో ఉంచారు.జైలులో ఉన్న సమయంలో రాగిణి అకస్మాత్తుగా కాలు జారి కింద పడటంతో నడుముకు, వెన్నుకు తీవ్రమైన గాయాలయ్యాయి.
అందుకుగాను జైల్లోనే ఆమెకు చికిత్స అందించినప్పటికీ,నొప్పి నుంచి ఉపశమనం లభించకపోవడంతో తనకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని రాగిణి జైల్లో రచ్చ రచ్చ చేసింది.
తాజాగా ఆమెకు మరోసారి వెన్నులో తీవ్రమైన నొప్పి రావడంతో గురువారం ఆమెను జైలు అధికారులు చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.గత కొన్ని రోజుల పాటు జైలు వార్డు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమెకు నొప్పి తగ్గకపోవడంతో సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు జైలు శాఖ అధికారులు తెలిపారు.రాగిణి కోరినట్టు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలి అంటే అందుకు కోర్టు అనుమతి తప్పనిసరిగా ఉండాలని జైలు అధికారులు అన్నారు.
శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఈ సెప్టెంబర్‌లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం అనారోగ్య కారణంగా ఈ హీరోయిన్ ఆస్పత్రి పాలయ్యారు.
రాగిణి అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.