తాను అనుకున్నది, తాను నమ్మింది జరిగి తీరాలనే సంకల్పంతో వైసీపీ అధినేత జగన్ రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు.అమరావతిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జగన్ దానికి ప్రత్యామ్నాయంగా మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు.
అలా ప్రతిపాదించి ఊరుకోకుండా దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎన్ని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గకుండా రాజధాని విశాఖ కు తరలించే ప్రయత్నం మొదలు పెట్టారు.
దానిలో భాగంగానే రాజధానిని తరలించే బిల్లును, దానితో పాటు సీఆర్డీఏ ను రద్దు చేసే బిల్లుకు శాసన సభలో జగన్ బిల్లు పెట్టి ఆమోదించుకున్నారు.మండలి విషయానికి వచ్చేసరికి ఆ బిల్లుకి బ్రేక్ పడింది.
దీంతో జగన్ లో ఎక్కడలేని ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉండటంతో బిల్లు ఆమోదం పొందకుండా సెలక్ట్ కమిటీకి వెళ్లిందని, ముందు ముందు కూడా ప్రతి బిల్లును తెలుగుదేశం ఈ విధంగానే అడ్డుకుంటుందని జగన్ భావిస్తున్నారు.
అది కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టే బిల్లుని, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇలా రెండు బిల్లులను కూడా శాసనమండలిలో టిడిపి అడ్డుకోవడంతో జగన్ చాలా కాలం నుంచి మండలిపై ఆగ్రహంతో ఉన్నారు.అందుకే శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
1985 లో ఎన్టీఆర్ రద్దు చేసిన శాసనమండలిని తిరిగి 2007 లో రాజశేఖర్ రెడ్డి మళ్లీ పునరుద్ధరించారు.కానీ ఇప్పుడు తనకు అదే శాసనమండలి ఇబ్బందికరంగా మారడంతో మండలిని రద్దు చేసే విధంగా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు.దీనికోసం కొత్త వాదనను జగన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు.సంవత్సరానికి శాసనమండలి ఖర్చు 60 కోట్లు అవుతుందని, పేద రాష్ట్రంగా ఉన్న ఏపీ కి ఇంత భారం అవసరమా అంటూ జగన్ మాట్లాడుతున్నారు.
మండలిని రద్దు చేయాలనుకున్నా అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.దీనికి కేంద్రం అనుమతి కూడా కావాల్సిందే.అయినా కేంద్రాన్ని ఏదోరకంగా ఒప్పించి మండలిని రద్దు చేసే విధంగా జగన్ తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసాడు.అవసరమైతే ఆర్డినెన్సు తీసుకువచ్చాయినా మండలి రద్దు చేయించే విధంగా ఆయన పావులు కదుపుతున్నాడు.
అయితే జగన్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే రాజ్య సభ, శాసన మండలి వంటి ఎగువ సభల ఏర్పాటు కి అవకాశం కల్పించారు.
దిగువ సభ లు అయిన లోక్ సభ, అసెంబ్లీ వంటివి సాధారణంగా అధికార పార్టీ మెజారిటీతో ఉంటాయి కాబట్టి, ఎప్పుడైనా వారు నియంతృత్వ పోకడలకు వెళ్లి విపరీత నిర్ణయాలు తీసుకుంటే అటువంటి నిర్ణయాలను కనీసం తాత్కాలికంగానే అయినా అడ్డుకోవడం కోసం ఇటువంటి ఎగువ సభల ఏర్పాటు కు అవకాశం కల్పించారు.కానీ ఇప్పుడు జగన్ వాటిని రద్దు చేసేందుకు ప్రయత్నించడపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.