ఇటీవల కాలంలో విమానంలో కొందరు ప్యాసింజర్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ అందరికీ భయాందోళనలు కలిగిస్తున్నారు.తాజాగా బోస్టన్ లోగన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ( Boston Logan International Airport )లో ఎవరూ ఊహించని ఘటన జరిగింది.
అందరూ షాక్ అయ్యేలా ఓ ప్రయాణికుడు ఏకంగా విమానం ఎమర్జెన్సీ డోర్‌ను పూర్తిగా ఓపెన్ చేశాడు.జెట్‌బ్లూ విమానం శాన్ జువాన్, ప్యూర్టోరికోకు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే, ప్రయాణికుడికి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో గొడవ జరిగిందట.కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి ఒక్కసారిగా సీటు నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లి ఎమర్జెన్సీ డోర్‌ను పట్టుకుని పూర్తిగా తెరిచేశాడు.
అంతేనా, ఎమర్జెన్సీ స్లైడ్ ( Emergency slide )కూడా వెంటనే తెరుచుకుంది.అక్కడ ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఏం జరుగుతుందో అర్థం కాక కొద్దిసేపు బిత్తరపోయారు.
అయితే, అప్రమత్తమైన ఎయిర్ మార్షల్( Air Marshal ), తోటి ప్రయాణికులు వెంటనే రంగంలోకి దిగారు.ఆ వ్యక్తి విమానం నుంచి దూకేందుకు ప్రయత్నించకుండా అతన్ని పట్టుకుని కిందకు లాగి వేశారు.పోలీసులు వచ్చేంత వరకు అతన్ని గట్టిగా పట్టుకుని కదలకుండా చేశారు.
సమయానికి వాళ్లు స్పందించకపోతే ఏం జరిగేదో ఊహించడానికే భయంగా ఉంది.ఈ గొడవకు అసలు కారణం వేరే ఉంది అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.
ఆ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చూడాలని అడిగాడట, కానీ ఆమె ఒప్పుకోలేదట.దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసిందని తెలుస్తోంది.
మరో ప్రయాణికుడు కూడా ఈ విషయాన్నే తెలిపాడు.ఆ వ్యక్తి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినట్టు ప్రవర్తించాడని, ఊహించని విధంగా డోర్ తెరవడానికి ప్రయత్నించాడని చెప్పాడు.
ఒక వ్యక్తి అయితే ఈ సంఘటనను మరింత అతిశయోక్తిగా చెప్పాడు.అతను విమానం డోర్ ను పూర్తిగా ఊడబికేశాడు అంటూ కామెంట్లు చేశాడు.
ఈ ఘటనపై మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు ( Massachusetts State Police )ఒక ప్రకటన విడుదల చేశారు.ఆ వ్యక్తి ఎలాంటి హెచ్చరిక లేకుండా విమానం తలుపు తెరిచాడని, ప్రయాణికులు అతన్ని నియంత్రించిన తర్వాత తమ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ఈ సంఘటనతో విమానయాన సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.దీంతో ఆ విమానంలోని ప్రయాణికులతో పాటు, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఇతర విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ ఘటన విమానాల్లో ప్రయాణికుల భద్రత, వారి ప్రవర్తనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.అదృష్టవశాత్తూ ఎయిర్ మార్షల్, ప్రయాణికులు వెంటనే స్పందించడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.