సోషల్ మీడియా ప్రస్తుతం ఓ వీడియోతో అట్టుడికిపోతోంది.ఈశాన్య భారతదేశానికి( North-East India ) చెందిన ఓ వ్లాగర్ తనను దాదాపు 8-9 ఏళ్ల వయసున్న పిల్లలు( Kids ) హేళన చేస్తున్న విజువల్స్‌ను షేర్ చేశాడు.
అధికారం చూసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఆ పిల్లలు అతడిని “చైనీస్”( Chinese ) అంటూ వెక్కిరిస్తూ, “చింగ్ చాంగ్ పింగ్ పాంగ్” అంటూ అసహ్యకరమైన పదాలతో అవమానించారు.
ఆ మాటలకు ఆ వ్లాగర్( Vlogger ) బాధతో కుమిలిపోతూ విస్తుపోయాడు.
అయితే అతడి ఆవేదన అంతటితో ఆగలేదు.
తన కుటుంబం దేశం కోసం చేస్తున్న సేవను గుర్తుచేసుకున్నాడు.అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దులో తన తమ్ముడు, బాబాయి వంటి వాళ్లు ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతుంటే, తన సొంత దేశంలోనే తనను “చైనీస్” అంటూ, “చింకీ మోమోస్” అంటూ అవమానించడం ఎంత బాధాకరమో చెప్పలేకపోయాడు.
ఈ వ్యాఖ్యలు తనను ఈ దేశంలో ఒంటరిని చేస్తున్నాయని, తాను ఇక్కడి వాడిని కాననే భావన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక అంతే, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు.“పిల్లలు పెద్దవాళ్లు మాట్లాడేదే నేర్చుకుంటారు.జాతి వివక్ష( Racism ) ఇంట్లోనే మొదలవుతుంది.” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “మన దేశంలోని ఈశాన్య ప్రాంతాల గురించి కనీస అవగాహన కూడా లేకపోవడం దారుణం” అని మరొకరు నిప్పులు చెరిగారు. “భారతదేశ వైవిధ్యాన్ని గుర్తించి, ఇలాంటి అజ్ఞానాన్ని వదిలించుకోవాలి” అని ఇంకొకరు సూచించారు.

“మన తోటి భారతీయులనే ఇలా అవమానిస్తే, వాళ్ళు ఈ దేశంలో భాగమని ఎలా భావిస్తారు?” అంటూ కొందరు దేశ సమైక్యతను ప్రశ్నించారు.“సమాజంగా మనం విఫలమయ్యాం.మన సొంత మనుషుల్నే వెక్కిరిస్తూ, ఐక్యంగా ఉన్నామని ఎలా చెప్పుకుంటాం?” అంటూ మరికొందరు నిలదీశారు.ఈ ఘటన భారతీయ సమాజంలో చాప కింద నీరులా దాగి ఉన్న జాతి వివక్షను, పక్షపాత ధోరణులను మరోసారి వెలుగులోకి తెచ్చింది.ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరైనా సరే గౌరవంగా, దయతో చూడాలి.
ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు.







