టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మృతి దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులకు కన్నీరు తెప్పించింది.దేశ వ్యాప్తంగా మొత్తం 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి అంతర్జాతీయ స్థాయి రికార్డును దక్కించుకున్న బాలు గారు తెలుగు వారు అవ్వడం మన గర్వకారణం.
ఆయన నివాసం చెన్నైలో ఉన్నా కూడా ఎక్కువగా ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా హైదరాబాద్‌లోనే ఉండేవారు.ఆయనకు కరోనా సోకింది కూడా హైదరాబాద్‌లోనే అనే విషయం తెల్సిందే.
అంతటి అనుబంధం టాలీవుడ్‌తో బాలు గారికి ఉంది.టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో మందికి ఆయన ఆప్తుడిగా పేరు దక్కించుకున్నారు.
చిరంజీవి గారు మాట్లాడుతూ బాలు గారిని అన్నయ్య అంటూ పిలిచేవాడిని అంటూ ఆయన మృతి సందర్బంగా తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.ఇంకా టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది బాలు గారి మృతి పట్ల స్పందించారు.
కాని వారు టాలీవుడ్ తరపున బాలు గారికి సంతాప సభ ఏర్పాటు చేయించడంలో మాత్రం విఫలం అయ్యారు.
బాలుగారు మృతి చెందిన వారం లోపే తమిళ సినిమా పరిశ్రమ నుండి ఆయనకు సంతాప సభ ఏర్పాటు చేయించారు.
కొందరు కోలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడంతో పాటు బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు.అయితే టాలీవుడ్ మాత్రం ఎందుకు ఈ విషయంలో పట్టించుకోవడం లేదు అంటున్నారు.
టాలీవుడ్ స్టార్స్ కరోనా పేరుతో భయపడుతూ బాలు గారికి సంతాప సభ నిర్వహించక పోవడం దారుణం అంటూ బాలు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బాలు గారి అంత్యక్రియలకు టాలీవుడ్ నుండి ఎవ్వరు హాజరు కాలేదు.
సరే చెన్నైలో అంత్య క్రియలు జరిగాయి కనుక అక్కడి వరకు ఏం వెళ్తారు లే అనుకోవచ్చు.ఇప్పుడు సంతాప సభ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
బాలు గారి పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న వారు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.