మనదేశం లో ఎంత టెక్నాలజీ పెరిగినా… ఆకాశం మీద నివాసాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నా… మూఢనమ్మకాల నుంచి మాత్రం జనాలను దూరం చేయలేకపోతున్నారు.ఆ ముద్ర నమ్మకాల వలన మేలు జరగకపోగా… కీడు మాత్రం జరుగుతోంది.
ఇక వివరాల్లోకి వెళితే మధుర దగ్గర్లోని నగలా ఫత్తే గ్రామానికి చెందిన కిషన్ సాహ్ ఏడాదిన్నరక్రితం తన కుమార్తెలైన పుష్ప, శివానిలకు కవలసోదరులైన యశ్వీర్, జైవీర్లతో వివాహం జరిపించాడు.కొద్ది రోజుల తరువాత శివానీ, జైవీర్ దంపతుల మధ్య వివాదాలు నెలకొన్నాయి.
ఈ నేపధ్యంలో శివాని అదే గ్రామంలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.అయితే ఆమెను రాజీ కోసం పంచాయతీ పెద్దలు పిలిపించారు.

ఈ సమయంలో కొంతమంది గ్రామీణులతో పాటు ఒక మంత్రగత్తెకూడా పంచాయతీకి హాజరైంది.ఈ సందర్భంగా ఆ మంత్రగత్తె తన తీర్పును వినిపిస్తూ భార్యాభర్తలిద్దరూ నిప్పుకణం పట్టుకోవాలని, ఎవరిచేయి కాలిపోతే వారే దోషులని తేల్చిచెప్పింది.ముందుగా జైవీర్ చేతిలో నిప్పుకణాన్ని ఉంచారు.అయితే ఆయన ఆ వేడి తట్టుకోలేక ఆ నిప్పు కణాన్ని కిందపడేశాడు.తరువాత శివానీ చేతిలో నిప్పు కణాన్ని ఉంచారు.దీంతో ఆమె చేతులు తీవ్రంగా కాలిపోయాయి.
విషయం తెలుసుకున్న శివానీ పుట్టింటివారు ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.కట్నం కోసం తమ కుమార్తెను అత్తింటివారు హింసిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.