అక్రమాస్తుల కేసులో దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 2017 ఫిబ్రవరి లో అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ దోషిగా తేలడం తో నాలుగేళ్ళ జైలు శిక్ష విధించడం తో అప్పటి నుంచి కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
బెంగుళూరులోని పరప్పణ అగ్రహారం జైలు లో శిక్ష అనుభవిస్తున్న ఆమె ను సత్ప్రవర్తన కారణంగా కొద్దీ రోజులు ముందుగానే జైలు నుంచి విడుదల చేయనున్నారు అధికారులు.వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకూ కూడా ఆమె జైలు జీవితం అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన తదితర కారణాల వల్ల వచ్చే ఏడాది జనవరి 27 నే ఆమెను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆమెకు సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానా ను ఆమె చెల్లించినట్లు తెలుస్తుంది.శశికళ తరపున ఆమె న్యాయవాదులు బెంగుళూరు సెషన్స్ కోర్టు లో 10 కోట్ల 10 వేలరూపాయలు చెల్లించినట్లు సమాచారం.డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా డబ్బులను అందజేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ మొత్తాన్ని ఓ రాజకీయ నాయకుడు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అయితే మరోపక్క వచ్చే ఏడాదిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడం తో ఈ సమయంలో శశికళ విడుదల అవుతుండడం తో ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.మరి అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించిన చిన్నమ్మ ఈ సారి తమిళ రాజకీయాల్లో ఎలాంటి పాత్రను పోషిస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.