మహారాష్ట్ర రాజకీయాలలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది.అక్కడ ఎన్నికలు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు పై మాత్రం అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అక్కడ జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సంపాదించిన బీజేపీ పార్టీ కి గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ఆహ్వానం అందించగా దానికి వారు నిరాకరించారు.ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన ఫడ్నవిస్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తెలిపారు.ఈ నేపథ్యంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందాయి.ప్రభుత్వ ఏర్పాటుకు బలాన్ని, సుముఖతను తెలపాలని శివసేన నేత ఏక్ నాథ్ షిండేకు గవర్నర్ సమాచారమిచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో ఈ రోజు రాత్రి 7.30గంటల్లోపు నిర్ణయాన్ని తెలపాలని గవర్నర్ సూచించారు.మరోపక్క మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ఎన్సీపీతో చర్చించే అవకాశముంది.
శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.అయితే రెండో అతిపెద్ద పార్టీ గా అవతరించిన శివసేన కు ఎన్సీపీ సపోర్ట్ చేయాలి అంటే ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలి అంటూ చిన్న కండీషన్ పెట్టినట్లు తెలుస్తుంది.మరి ఆ కండీషన్ కు కట్టుబడి శివసేన నిర్ణయం తీసుకుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.