తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తుండటం తో కొద్దిరోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది.
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ మేరకు తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊతం ఇస్తున్నాయి.విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
దీనికి తగ్గట్లుగానే ఆయన రేవంత్ కు అత్యంత సన్నిహితులు కావడం అనేకమార్లు రేవంత్ తో చర్చలు జరపడం దీనికి మరింత ఊతం ఇచ్చాయి.
అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, గ్రూపు రాజకీయాలు పెరిగి పోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ కంటే బిజెపిలో చేరడం మంచిదనే అభిప్రాయంతో ఆయన ఉంటూ వచ్చారు.
ఈ నెల 14న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది.ఆ ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు.
ఆయన సమక్షంలోనే విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ సమయంలోనే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే ఆలోచన విశ్వేశ్వర రెడ్డి చేస్తున్నారట.
ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో ఆయన చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.గత కొంతకాలంగా కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల జరిగిన రాహుల్ సభకు ఆయన హాజరు కాలేదు.

అలాగే పిసిసి విస్తృతస్థాయి సమావేశానికి హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ కు రాజగోపాల్ రెడ్డి దూరమవుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి తో విశ్వేశ్వర్ రెడ్డి కొత్తపార్టీ అంశంపై చర్చించినట్లు సమాచారం.ఇప్పటికే తనకు కాంగ్రెస్ బీజేపీల నుంచి ఆహ్వానాలు అందాయి అని విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
కానీ టిఆర్ఎస్ ను ఓడించడమే తన లక్ష్యమని,రాబోయే రెండు మూడు నెలల్లో భారీ మార్పులు వస్తాయని తెలంగాణ కోసం కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే మంచిదని , రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారనే విషయం అర్థమైంది.
ఇదే అంశంపై రాజగోపాల్ రెడ్డి తో చర్చించినట్లు సమాచారం.కొత్త పార్టీ పెట్టాకంటే కనీసం మూడు వేల కోట్లు ఉండాలని అంచనాకు వచ్చారట.
గతంతో పోలిస్తే కెసిఆర్ గ్రాఫ్ భారీగా తగ్గిందని, కెసిఆర్ పాలన పై సర్వేలో 75% ఆయన పై వ్యతిరేకత ఉందని , కేవలం 25 శాతం కంటే తక్కువ కేసీఆర్ కు మద్దతు ఉందని విశ్వేశ్వరరెడ్డి విశ్లేషించారు.
అలాగే కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు.
కొత్త పార్టీ ఏర్పాటుపై రాజగోపాల్ రెడ్డి తో చర్చిస్తున్నారని, కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత దానిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి ? ఏవిధంగా అధికారంలోకి రావాలి ? భారీగా చేరికలు ఉండాలంటే ఏం చేయాలి ఎలా అనేక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.