కన్నడ సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ కు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెల్సిందే.అంతా అనుకున్నట్లుగా జరిగితే కేజీఎఫ్ 2 చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేసేవారు.
కాని కరోనా కారణంగా ఆరు నెలల పాటు షూటింగ్ జరగలేదు.కనుక సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత షూటింగ్‌ను మొదలు పెట్టారు.కరోనా వల్ల ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేసిన యూనిట్ సభ్యులు ఇంకా వెయిట్ చేయడం కష్టం అంటూ నిర్ణయించుకున్నారు.
కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుని కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్‌ను మొదలు పెట్టినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.ప్రస్తుతం యశ్ తో పాటు కీలక నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
కేవలం 60 మంది లోపు టెక్నీషియన్స్ మరియు కాస్ట్‌తో షూటింగ్ జరుగుతోంది.అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్‌కు ఇటీవలే లంగ్ క్యాన్సర్ అంటూ నిర్థారణ అయ్యింది.
కనుక ఆయన షూటింగ్‌కు హాజరు అయ్యేనా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

అమెరికా వెళ్లి సంజయ్ దత్ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటాడని అనుకున్నారు.కాని ఇప్పటి వరకు అమెరికాకు వెళ్లే యోచనలో సంజయ్ దత్ లేడు.ముంబయిలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.
కనుక కేజీఎఫ్ 2 చిత్రం లో తన పార్ట్‌ను పూర్తి చేసేందుకు సంజయ్ దత్ ఓకే చెప్పే అవకాశం ఉంది.ఆయన రోల్ ను కాస్త కుదించి లేదంటే షూటింగ్ రోజులను కుదించడం ద్వారా ఆయనకు ఎక్కువ ఇబ్బంది లేకుండానే కేజీఎఫ్ 2ను ముగించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడట.