కరోనా కట్టడి కోసం ప్రపంచదేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తూ వైరస్‌ను అదుపు చేసేందుకు తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలో ప్రయాణ ఆంక్షలు విధించడంతో వివిధ దేశాల్లో ఉన్న విదేశీయులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.
అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో తెలియకపోవడంతో ఆయా దేశాల్లోని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా ఉన్నారు.
లాక్‌డౌన్ ముందు వరకు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చింది.కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో అంతకంతకూ క్షీణించడంతో సాధ్యం కాలేదు.
ఈ సంగతి పక్కనబెడితే దేశం కానీ దేశంలో మరణించిన వారి ఆవేదన గుండెల్ని పిండేస్తోంది.ట్రావెల్ బ్యాన్ అమల్లో ఉండటంతో విదేశాల్లో మరణించిన భారతీయులు కనీసం చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు.
వీలైతే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.లేని పక్షంలో అక్కడి మార్చురీల్లో రోజుల తరబడి ఉంచేస్తున్నారు.
అచ్చం ఇలాంటి పరిస్ధితినే ఎదుర్కోంటోంది కేరళకు చెందిన ఓ కుటుంబం.

కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని మహారాజా కాలేజ్‌లో స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 70 ఏళ్ల శ్రీకుమార్, అతని భార్య శ్రీకుమారి.ఈ దంపతులు కొద్దిరోజుల క్రితం షార్జాలో ఉంటున్న కుమార్తె శ్రీజను చూడటానికి వెళ్లారు.షెడ్యూల్ ప్రకారం వారు శనివారం నాటికి కేరళకు రావాల్సి ఉంది.
అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో భారత్‌కు వెళ్లలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో గురువారం శ్రీకుమార్ ఛాతీ నొప్పితో బాధపడటంతో షార్జాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురై కన్నుమూశారని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.దురదృష్టవశాత్తూ, ఈ సమయంలో తాము అతని మృతదేహాన్ని భారతదేశానికి పంపించలేమని.
అందువల్ల షార్జాలోనే శ్రీకుమార్ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబం నిర్ణయించిందని ఓ బంధువు పేర్కొన్నారు.అయితే ఆయన కడసారి చూపు కోసం ఎదురుచూసిన కేరళలోని ఆయన బంధువులు, ఇతర కుటుంబసభ్యులు మాత్రం కన్నీటి పర్యంతమయ్యారు.