ఎవరికైనా ఏదైనా కలిసి వస్తే పంట పండింది అంటుంటాం కదా.నిజంగానే ఈ రైతు పంట పండింది.
తాను పండించిన పంట తనను కోటీశ్వరున్ని చేసింది.అప్పటి వరకూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ రైతు.
సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.ఉల్లి ధరలు సామాన్యుడికి కంటతడి పెట్టిస్తున్నా.
అక్కడక్కడా ఇలాంటి రైతులకు మేలు చేస్తోంది.

కర్ణాటకకు చెందిన మల్లికార్జున అనే రైతు సక్సెస్ స్టోరీ ఇది.ఈ పంట పండక ముందు వరకూ అతడు కూడా ఓ సాదాసీదా రైతు.పంట వేయాలంటే కుదువ పెట్టి అప్పు చేయాల్సిందే.
అలా అప్పటికే లక్షల అప్పు చేశాడు.అయినా సరే ధైర్యం చేసి ఈసారి తనకున్న 20 ఎకరాల పొలం మొత్తం ఉల్లి పంట సాగు చేశాడు.
అదృష్టం కలిసి వచ్చింది.అతడు ఊహించని రీతిలో ధరలు పెరిగిపోవడంతో ఒక్క పంటతోనే కోటీశ్వరుడు అయిపోయాడు.మొత్తం 20 ఎకరాలు కలిపి ఏకంగా 240 టన్నుల పంట రావడం విశేషం.మార్కెట్లో ధర భారీగా ఉండటంతో ఈ పంటకు మొత్తం రూ.1.68 కోట్లు వచ్చాయి.దీంతో మల్లికార్జున ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ పంట కోసం చేసిన రూ.15 లక్షల అప్పుతోపాటు అంతకుముందున్న మొత్తం అప్పును తీర్చేశాడు.ఇప్పుడు ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నట్లు చెప్పాడు.
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే అన్నదాతలు ఉన్న మన దేశంలో ఇలా ఒక్క పంటతో కోటీశ్వరుడైపోయిన రైతులు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
మరోవైపు ఏపీలో ఉల్లి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రైతు బజార్లో ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం ప్రజలు ఎగబడుతున్నారు.ప్రతి రైతు బజార్ ముందు భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి.
ఒంగోలులోని కొత్తపట్నం రైతుబజార్లో ఇచ్చే ఉల్లి కోసం వేకువజాము నుంచే ప్రజలు వేచి చూశారు.ఈ క్రమంలో గంటల తరబడి లైన్లో నిల్చొన్న ఓ మహిళ స్పృహ తప్పి కింద పడిపోయింది.
తర్వాత ఆమె ఉల్లిపాయలు కొనకుండానే ఇంటికెళ్లిపోవడం విశేషం.