అమెరికాలోని విదేశీ పౌరులకు పుట్టే పిల్లలకు జన్మత: వచ్చే యూఎస్ పౌరసత్వాన్ని(US citizenship) రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికాలో మిశ్రమ స్పందన వస్తోంది.దీని ప్రకారం చట్టబద్ధంగా పత్రాలు లేని వలసదారులకు జన్మించే పిల్లలకు ఇకపై యూఎస్ పౌరసత్వం లభించదు.
వలసలను అడ్డుకునే క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని.
అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను(Executive order) నిలుపుదల చేయాలంటూ డెమొక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి.న్యాయస్థానాలు కలగజేసుకోకుంటే ఈ ఉత్తర్వులు నెల లోపు అమల్లోకి రానున్నాయి.
మరోవైపు.ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత సంతతికి(Indian descent) చెందిన అమెరికా చట్టసభ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వలసదారులతో పాటు భారతదేశ విద్యార్ధులు, నిపుణులను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు.జన్మత: పౌరసత్వం నిబంధనలో మార్పులు తీసుకురావడం వల్ల అక్రమంగా, పత్రాలు లేని వలసదారుల నవజాత శిశువులపైనే (new borns)కాకుండా హెచ్ 1 బీ వీసాలపై చట్టబద్ధంగా ఈ దేశంలో నివసిస్తున్న వారిపైనా ప్రభావం చూపుతుందని భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను, మేథస్సును తీసుకొచ్చే హెచ్ 1 బీ వీసాల ప్రధాన లబ్ధిదారులు భారతీయులే.ఇండియా నుంచి ప్రతియేటా అధిక నైపుణ్యం కలిగిన వారు హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికాలో అడుగుపెడతారు.ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాను అన్ని రకాలుగా పోరాడుతానని ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీథానేదర్ తెలిపారు.ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ మండిపడ్డారు.
దీనిని అమలు చేస్తే మన దేశ చట్టాలను, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను అపహాస్యం చేసినట్లేనని ప్రమీల అభిప్రాయపడ్డారు.
అటు వలస హక్కుల సంఘాల కూటమి దీనిని కోర్టులో సవాల్ చేయడంతో పాటు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.ట్రంప్ తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఉత్వర్వు ప్రకారం .ఫిబ్రవరి 19 తర్వాత అమెరికాలో పుట్టే శిశువుల తల్లిదండ్రులలో ఒకరు అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి కాకపోతే ఆ శిశువుకు జన్మత: అమెరికా పౌరసత్వం దక్కదు.