డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలువురు ప్రవాస భారతీయులకు కీలక పదవులు దక్కిన సంగతి తెలిసిందే.అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్ధ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధిపతిగా కొద్దిరోజుల క్రితం భారత సంతతికి చెందిన కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో భారత మూలాలున్న వ్యక్తి కీలక బాధ్యతలు స్వీకరించారు.అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు( National Institutes of Health ) నూతన సారథగా జయ్ భట్టాచార్యను( Jay Bhattacharya ) డొనాల్డ్ ట్రంప్ గతంలో నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర వేసింది.సెనేట్ నిర్ణయంపై జయ్ భట్టాచార్య హర్షం వ్యక్తం చేశారు.

1968లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు జయ్ భట్టాచార్య.1997లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డాక్టరేట్ పొందిన ఆయన ఇదే సంస్థ నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ అందుకున్నారు.అనంతరం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ప్రొఫెసర్‌గా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్‌లో అసోసియేట్‌గా భట్టాచార్య విధులు నిర్వర్తించారు.అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు అక్టోబర్ 2020లో జయ్ భట్టాచార్యతో పాటు మరో ఇద్దరు విద్యావేత్తలు గ్రేట్ బారింగ్‌టన్ డిక్లరేషన్‌ను ప్రచురించి దుమారం రేపారు.
దీని ప్రకారం.వైరస్ బారినపడని వారు సాధారణ జీవితాన్ని కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.

ఎన్ఐహెచ్ డైరెక్టర్ హోదాలో 47.3 బిలియన్ల బడ్జెట్‌ను పర్యవేక్షించడంతో పాటు సంస్థకు జయ్ భట్టాచార్య నాయకత్వం వహిస్తారు.ఎన్‌ఐహెచ్‌ని పర్యవేక్షించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌కి నాయకత్వం వహించడానికి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్ ఇప్పటికే నియమించారు.ఎన్ఐహెచ్ డైరెక్టర్ దేశంలోని 27 ఇన్‌స్టిట్యూట్‌లు, సెంటర్‌ల ప్రారంభ పరిశోధనలపై పర్యవేక్షిస్తారు.
ఇందులో మహమ్మారుల వ్యాక్సిన్స్‌తో పాటు కొత్త ఔషధాల తయారీ వంటి లక్ష్యాలు కూడా ఉంటాయి.