ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.అమెరికా, యూకే, బ్రిటన్, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలకు భారతీయ విద్యార్ధులు( Indian Students ) పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు.
అయితే దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, జర్మనీ వంటి దేశాలలోని విద్యాసంస్ధలలో చేరుతున్న భారతీయ విద్యార్ధుల సంఖ్య నేడు పెరుగుతోంది.తాజాగా ఈ లిస్ట్‌లోకి న్యూజిలాండ్( New Zealand ) కూడా చేరింది.
నాణ్యమైన విద్య, ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలతో న్యూజిలాండ్‌లో చదువుకునే భారతీయ విద్యార్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

2021 నుంచి న్యూజిలాండ్‌లో భారతీయ విద్యార్ధుల నమోదు 48.9 శాతం పెరిగిందని ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని గ్లోబల్ స్టూడెంట్ హౌసింగ్ ప్లాట్‌ఫాట్ అయిన యూనివర్సిటీ లివింగ్( University Living ) విడుదల చేసిన నివేదిక తెలిపింది.బియాండ్ బెడ్స్ అండ్ బెంచెస్ – డీకోడింగ్ ఏఎన్‌జెడ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే నివేదిక దీనిని వెలువరించింది.ఓషియానియా ప్రాంతంలో విద్యార్ధుల వలసలు క్రమంగా పెరుగుతున్నాయి.2015లో 2.1 మిలియన్ల నుంచి 2024లో ఇవి 2.3 మిలియన్లకు పెరిగాయి.2021 నుంచి 2024 మధ్య ఆస్ట్రేలియాలో( Australia ) భారతీయ విద్యార్ధుల నమోదు కూడా 9.2 శాతం పెరిగింది.అంతర్జాతీయ విద్యార్ధులు 2023 – 24 మధ్యకాలంలో న్యూజిలాండ్ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు 4.4 బిలియన్లు , ఆస్ట్రేలియాకు 47.8 బిలియన్ డాలర్లను అందించారు.

యూనివర్సిటీ లివింగ్ వ్యవస్ధాపకుడు , సీఈవో సౌరభ్ అరోరా మాట్లాడుతూ.అధ్యయనం, విదేశీ ప్రయాణాన్ని సులభతరం చేసే సంస్కరణల కారణంగా న్యూజిలాండ్‌లో చదువుకునే అంతర్జాతీయ విద్యార్ధుల నమోదు పెరిగిందన్నారు.క్రమబద్ధీకరించబడిన వీసా ప్రక్రియలు, పని హక్కుల విధానాలు, భారతీయ విద్యార్ధుల కోసం 10,000 న్యూజిలాండ్ డాలర్ల స్కాలర్‌షిప్‌ను తీసుకురావడం సానుకూల ఫలితాలు తీసుకొచ్చాయని అరోరా తెలిపారు.2025 -2030 మధ్య న్యూజిలాండ్‌లో భారత్ నుంచి నమోదులు 93.9 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.ఉపాధి అవకాశాలు పెంచడానికి భారత్ – న్యూజిలాండ్‌లు ఇండస్ట్రీ అవసరాలు తీర్చే విద్యా విధానానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయి.ముఖ్యంగా STEM, ఆరోగ్య సంరక్షణ, వ్యాపార రంగాలపై ఫోకస్ పెట్టాయి.