దేశంలోని ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల విలీనం, నిర్వహణ, సెక్యూరిటీ, ద్రవ్య విధానం దాని పర్యవసనాలు పట్ల సగటుజీవి భయాందోళనలో ఉన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకు లే మూలాధారం.
ద్రవ్య విధానం సజావుగా సాగాలన్నా, ప్రజలు పొదుపు బాట పట్టాలన్నా, వారి కష్టార్జితం వృద్ధి కావాలన్నా, అది భద్రంగా భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడాలన్న బ్యాంకులే ప్రధానం.వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఆర్థిక చేయూత లభించాలన్నా బ్యాంకులే కీలకం.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు బలమైన బ్యాంకులే పునాదులు.అటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ దేశంలో ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది.
ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికి ప్రస్నార్ధక మయ్యింది.ఇటీవల బ్యాంకింగ్ రంగంలో వెలుగు చూస్తున్న వరుస పరిణామాలు ఇందుకు నిదర్శనం .ఒక వైపు బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకం చేస్తూ లాభాలను హరిస్తున్న మొండి బకాయిలు, మరోవైపు మోసగాళ్లతో చేతులు కలిపి ప్రతిష్ఠను దిగజారుస్తున్న ఇంటిదొంగలు, ఇంకోవైపు ప్రభుత్వ విధానాలు, బ్యాంకర్ల నిర్ణయాలతో దెబ్బతింటున్న ఖాతాదారుల విశ్వాసం, ఇంకా వేధిస్తున్న మూలధనం కొరత.వెరసి బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.
ఇక బడా కార్పొరేట్ల మోసాలకు బ్యాంకుల్లోని ఉన్నతస్థాయి సిబ్బంది అండగా నిలబడుతుండటం, అలాగే ప్రభుత్వాలు కార్పొరేటు కేటుగాళ్ళ పై ఉదాసీన వైఖరి, బడా పారిశ్రామికవేత్తలకు రుణ భారం రైటాఫ్ చేయడంతో బ్యాంకుల నష్టాల్ని మరింతగా పెంచుతున్నాయి.భారత్‌లో బ్యాంకుల విలీనం ఇది కొత్తేమీ కాదు.అయితే, ముందెప్పుడూ ఇంత భారీ స్థాయిలో, కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే పరిమితమై విలీన ప్రక్రియ చేపట్టలేదు.1969 జులై 20న 14 అతిపెద్ద వాణిజ్య బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది.వ్యవసాయం, చిన్నపరిశ్రమలు, ఎగుమతులు, పారిశ్రామికీకరణకు ఊతమిచ్చేందుకు, బలహీనవర్గాలను బలోపేతం చేసేందుకు ఆ చర్య తీసుకుంది.ఆ తర్వాత 1980లో ఆంధ్రాబ్యాంకు సహా మరో 13 బ్యాంకులను కూడా జాతీయం చేశారు.
భారత ఆర్థిక చరిత్రలో అతిప్రధానమైన విధానపరమైన నిర్ణయం ఇదే అని విశ్లేషకులు తరచూ చెబుతుంటారు.బ్యాంకుల జాతీయం కన్నా ముందు భారత ఆర్థిక వ్యవస్థను భారీ కార్పొరేట్ సంస్థలే నియంత్రించేవి.
డిపాజిటర్లకు ఎలాంటి రక్షణా ఉండేది కాదు.బ్యాంకుల జాతీయీకరణ, 1991లో చేపట్టిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది.

వినియోగదారులు, పెట్టుబడిదారుల్లో గొప్ప విశ్వసనీయతను సంపాదించుకుంది.పీఎస్‌బీల సంఖ్య తగ్గిపోవడం వల్ల మానవవనరులు, ఉద్యోగకల్పన, ఆర్థికవృద్ధి వంటి వాటికి కొన్ని స్వల్పకాలిక, మరికొన్ని దీర్ఘకాలిక ప్రతికూలతలు ఎదురవ్వొచ్చు.పీఎస్‌బీల విలీనం ఉద్దేశం ఏంటన్నదానిపై పూర్తి స్పష్టత లేదు.బ్యాంకులను లాభాల్లోకి రావడం కోసమో లేక పెట్టుబడుల అవసరాలు తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు.స్వల్పకాలికంగా ఎదురయ్యే ప్రతికూలతల్లో ప్రధానమైనది మానవవనరులపై పడే ప్రభావమే.సంస్కృతి పరంగా, కార్యకలాపాలపరంగా ఆయా బ్యాంకుల మధ్య ఉండే తేడాలకు తగ్గట్లు సర్దుకుపోవడం ఉద్యోగుల వైఖరి ఎలా ఉంటుందన్నదాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విలీన నిర్ణయం తీసుకున్నారు.
ఎస్‌బీఐ, దాని అనుబంధ ప్రాంతీయ బ్యాంకుల విలీనంతో పోలిస్తే ఇప్పుడు జరగబోయే విలీనం పూర్తి భిన్నంగా ఉంటుంది.ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల వ్యవహారాలు, సంస్థాగత నిర్మాణం ఒకేలా ఉండేవి.
కానీ, ఇప్పుడు పీఎస్‌బీల విషయంలో అలా కాదు.నిరర్థక ఆస్తులు, మొండి బకాయిల సమస్యలను నియంత్రించేందుకు, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచేందుకు విలీనం ఉపయోగపడుతుందా? అనేది మరో పెద్ద ప్రశ్న.
ప్రపంచవ్యాప్తంగా ఒకదాని తరువాత మరొక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నప్పటికీ , మన దేశంలో బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండడంతో సంక్షోభం ప్రభావం కనిపించలేదు.ఒకవైపు అమెరికా తన ఆర్థిక వ్యవస్థను, కుప్పకూలిన బ్యాంకింగ్ రంగాన్ని కాపాడు కోవడానికి పెద్ద ఎత్తున బెయిల్‌అవుట్ ప్యాకేజిలను ప్రకటిస్తున్న సమయంలో మన ఆర్థిక వ్యవస్థ నామమాత్రమైన నష్టంతో బయటపడింది.
ఆ కాలంలో మన బ్యాంకులు లాభాలను ఆర్జించడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేశాయి.వ్యవసాయ రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వడంతో పాటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీగా నిధులు అందుబాటులోకి తీసుకొచ్చాయి.