ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి దశ ముగిసింది.ఓవరాల్‌గా వైసీపీ తిరుగులేని విజయం సాధించింది.
ఆ పార్టీ సాధించిన సర్పంచ్ స్థానాలకు టీడీపీ సాధించిన సర్పంచ్ స్థానాలకు మధ్య పొంతన లేదు.టీడీపీ 25 శాతం సర్పంచ్ స్థానాల్లో విజయం సాధిస్తే వైసీపీ ఏకంగా 75 శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది.
కట్ చేస్తే కొంత మంది మంత్రులకు ఈ ఎన్నికలు షాక్ ఇచ్చాయి.ముఖ్యంగా ఆరుగురు మంత్రులకు జగన్ నిర్దేశించిన విధంగా ఫలితాలు రాలేదని వారికి వచ్చే కేబినెట్ ప్రక్షాళనలో షాక్ తప్పదనే అంటున్నారు.

ఈ ఆరుగురిలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇద్దరు మంత్రులు గోదావరి జిల్లాల నుంచి మరో మంత్రి.ఇక సీమ జిల్లాల నుంచి మరో ఇద్దరు మంత్రులను ఖచ్చితంగా తప్పించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి కేబినెట్‌ను ఏర్పాటు చేసినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను తప్పించేస్తానని చెప్పారు.ఇక ఇప్పుడు ఈ తప్పించే వారి లిస్టులో ఎక్కువ మంది స్థానిక సంస్తల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించ లేని వారే ఎక్కువ మంది ఉంటారని తెలుస్తోంది.
చాలా మంది మంత్రులు అటు తమ వాయిస్‌తో పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగ పడడం లేదు.ఇటు తమ నియోజకవర్గాల్లో కూడా కనీసం ప్రభావం చూపించకపోతే ఇంకెందుకు ? అన్న రీతిలో జగన్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.కొందరికి ఇప్పటకీ తమ శాఖల్లో పట్టు సాధించలేని పరిస్థితి.జిల్లా స్థాయిలోనే మంత్రులుగా ప్రభావం చూపలేని మంత్రులు చివరకు తమ డివిజన్లలో కాదు కదా తమ నియోజకవర్గంలోనూ ఏకపక్షంగా ఫలితాలు రాబట్టుకోలేదన్న నివేదికలు ఇప్పటికే పార్టీ పరిశీలకుల ద్వారా జగన్ వద్దకు వెళ్లాయి.
అందుకే జగన్ ఈ మంత్రులను స్థానికం సాకుతో తప్పించేస్తారని అంటున్నారు.