ఏపీ మంత్రి జయరాంని టీడీపీ వదిలేలా కనిపించడం లేదు.ఆయన్ని పదే పదే టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ, మంత్రి పదవి మధ్యలోనే పోయేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ముందు నుంచి జయరాం ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు.ఆ మధ్య మంత్రి సొంత వూరులోనే పేకాట క్లబ్బులు నిర్వహించడం సంచలమైన విషయం తెలిసిందే.
ఈ పేకాట క్లబ్‌లతో మంత్రి సోదరుడుకు లింక్ ఉందనే ఆరోపణలు కూడా గుప్పుమన్నాయి.
అసలు మంత్రి ఆధ్వర్యంలోనే పేకాట క్లబ్‌ల నిర్వహణ జరుగుతుందని టీడీపీ విమర్శలు చేసింది.
ఇక దీనిపై మంత్రి క్లారిటీ ఇస్తూ, పేకాట క్లబ్‌లతో తనకు సంబంధం లేదని చెప్పారు.ఇక ఈ వివాదం తర్వాత టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మంత్రిని టార్గెట్ చేసి, సరికొత్త ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చారు.
ఈఎస్‌ఐ స్కామ్‌లో నిందితుడుగా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి, మంత్రి తనయుడుకు బెంజ్ కారు లంచంగా ఇచ్చారని ఆరోపణలు చేస్తూ, దానికి సంబంధించిన ఆధారాలు మీడియా ముందుపెట్టారు.
ఇక దీనిపై కూడా మంత్రి క్లారిటీ ఇస్తూ ఓ సారి కారు తమది కాదని, వేరే వాళ్ళ కారు పక్కన తన తనయుడు ఫోటో దిగారని చెప్పగా, మరోసారి కారు ఫైనాన్స్ వాళ్ళు పట్టుకెళ్లారని చెప్పారు.
అయినా సరే అయ్యన్న ఈ విషయాన్ని వదలకుండా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే జయరాం భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
ఒకేసారి 4 వందల ఎకరాలు తీసుకునేందుకు ప్లాన్ చేశారని, ల్యాండ్ సీలింగ్ చట్టం ఉండడంతో 204 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి రాకుండా భూమి విడదీశారని అయ్యన్న సంచలన ఆరోపణలు చేశారు.
ఈ విషయంపై కూడా మంత్రి క్లారిటీ ఇస్తూ, తాను అన్నీ చెక్ చేయించి 100 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశానని, అక్రమం జరిగిందని రైతులెవరూ ఆరోపించలేదన్నారు.
అయితే మంత్రి ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగినట్లే కనిపిస్తోంది.మంత్రి మీద పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా వచ్చేసిందనే చెప్పొచ్చు.ఎలాగో జగన్ మరో ఏడాదిలో కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు కాబట్టి, ఆ విస్తరణలో జయరాం పదవి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు.మొత్తానికైతే టీడీపీ నేతలు జయరాం పదవి పోయేవరకు వదిలేలా లేరు.