వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీలో భారీ ప్రక్షాళనకు తెర తీశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి తీసుకురావడంతో పాటు, వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలలోను టెన్షన్ పుట్టిస్తుంది.
ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ఇన్చార్జిలను నియమించగా, మరో జాబితా విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.దాదాపు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను , నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమించేందుకు జగన్ లిస్టు సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రస్తుత వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లుగా సర్వేలు , ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ల ద్వారా అంచనాకు వచ్చిన జగన్ , ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే .గెలుపునకు డోకా ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు.
11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చారు.రెండో విడత జాబితాను అతి త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
మొదటి విడత జాబితాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు, రాయలసీమకు చెందిన అనేకమంది ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.వచ్చే ఎన్నికల్లో వీరికి ఎందుకు సీటు ఇవ్వలేకపోతున్నామో జగన్ వివరంగా చెప్పారు.
సర్వే నివేదికలను అభ్యర్థుల ముందే ఉంచి , తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వారికి వివరించారు.పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.అప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తామని , అన్ని విధాలుగా న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.తాడేపల్లి కేంద్రంగా రెండో విడత జాబితా విడుదల చేసేందుకు జగన్ పార్టీ కీలక నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు , రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు , పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ , ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి , పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ ,కదిరి ఎమ్మెల్యే సిద్ధ రెడ్డితో పాటు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉష శ్రీ చరణ్ ఉన్నారు.దీంతో వీరందరికీ సీటు లేదనే విషయాన్ని జగన్ చెప్పారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరింత టెన్షన్ ఆ పార్టీ ఎమ్మెల్యే ల్లో నెలకొంది.